Sep 22,2022 17:08

వాషింగ్టన్‌ :  అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఓ కార్యక్రమంలో వేదికపై ఎటు వెళ్లాలో అర్థం కాక తికమకపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గ్లోబల్‌ ఫండ్‌కి చెందిన 'సెవెన్త్‌ రీప్లెనిష్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌' కార్యక్రమం బుధవారం న్యూయార్క్‌లో జరిగింది. ఎయిడ్స్‌, క్షయ, మలేరియాలపై పోరాడేందుకు అవసరమైన నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం  ద్వారా అత్యధికంగా 14.25 బిలియన్‌ డాలర్లు సేకరించారు. ఈ కార్యక్రమంలో బైడెన్‌ ప్రసంగిస్తూ.. ఇందుకు సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రసంగం అనంతరం బైడెన్‌ పోడియం నుండి కుడివైపుకి తిరిగి .. నడుచుకుంటూ వెళ్తూ కొన్ని సెకన్ల పాటు నిల్చుండిపోయారు. ఎటువైపు నుండి వేదిక దిగాలో అర్థం కాక అలాగే చూస్తూ నిల్చుండిపోయారు. చప్పట్లు మార్మోగుతుండగా ఏదో మాట్లాడినా వినిపించలేదు. ఇప్పటివరకు ఈ వీడియో సుమారు 20 లక్షల మంది వీక్షించారు. కాగా, బైడెన్‌ మతిమరుపుతో వ్యవహరించడం ఇదే మొదటిసారికాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో ఎవరూ లేకపోయిన షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు బైడెన్‌ చేయి అందించిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే.

 

;