Mar 05,2023 23:12
  • వలంటీర్లతో పట్టభద్రులను తీసుకొచ్చి సమావేశం

ప్రజాశక్తి - విశాఖపట్నం : విశాఖలో అధికార పార్టీ నేతలు, వలంటీర్లు ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. వలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించరాదని ఎన్నికల అధికారి చెప్పినా అది మాటకే పరిమితమైంది. సీతమ్మధారలోని రాధాకృష్ణ ఫంక్షన్‌ హాల్‌లో వైసిపి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు మద్దతుగా ఆదివారం ఆత్మీయ సమావేశం పేరిట ఓ కార్యక్రమం తలపెట్టారు. ప్రతి వలంటీరు తమ పరిధిలోని పట్టభద్రులను ఈ సమావేశానికి తీసుకురావాలని జివిఎంసి 16వ వార్డు వైసిపి కార్పొరేటర్‌ మొల్లి అప్పారావు పేరిట వాట్సాప్‌లో మెసేజ్‌లు వెళ్లాయి. దీంతో సుమారు 150 మంది వలంటీర్లు, పట్ఠభద్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టిటిడి చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనమండలి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపి ఎంవివి.సత్యనారాయణ, వైసిపి జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబు, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సీతంరాజు సుధాకర్‌ పాల్గనారు. వార్డు వలంటీర్లను ఉపయోగించి పట్టభద్రులతో సమావేశం నిర్వహిస్తున్నారని ఆదివారం ఉదయమే ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు. సమావేశాన్ని అడ్డుకోవాలని కోరారు. అయినప్పటికీ ఆ దిశగా చర్యలు కానరాలేదు.