Oct 02,2022 21:41
  • జోరు వానలోనూ పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజానీకం

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : దేశ, రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం కాకుండా కాపాడుకుంటామని పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, విశాఖ ప్రజలు మరోసారి స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఉద్యమం 600 రోజులకు చేరవవుతున్న సందర్భంగానూ, గాంధీ జయంతిని పురస్కరించుకునీ వైజాగ్‌ బీచ్‌ రోడ్డులోని పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి ఆర్‌కె బీచ్‌ వద్దనున్న కాళీమాత టెంపుల్‌ వరకూ ఆదివారం 'ఉక్కు' సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించారు. జోరువానలోనూ వందలాది మందితో ఈ పాదయాత్ర స్ఫూర్తిదాయకంగా కొనసాగింది. సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌ నినాదాలతో బీచ్‌ రోడ్డు హోరెత్తింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రను ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ ప్రారంభించి మాట్లాడారు. గాంధీ మార్గంలో నడుస్తూ నల్ల వ్యవసాయ చట్టాలపై రైతులు పోరాడి ఎలా విజయం సాధించారో, అదే విధంగా విశాఖ ఉక్కు కార్మికులు, ప్రజలు పోరాడి మోడీపై విజయం సాధించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రారంభమైన పాదయాత్ర భారీ వర్షం, ఉరుములు, మెరుపుల మధ్యనే సాగుతూ కాళీమాత టెంపుల్‌ వద్దకు చేరుకుంది. అక్కడ నిర్వహించిన సభలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌, సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ.. ఎండా, వానలు పోరాటాలకు అడ్డుకావని తెలిపారు. నాటి బ్రిటిష్‌ వారు దేశ సంపదను దోచుకుపోగా, నేటి మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను, పోర్టులను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి గాంధీ జయంతి రోజున అందరూ ప్రతిజ్ఞబూని రెట్టించిన ఉత్సాహంతో ఉక్కు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వ విప్‌, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటుపరం కానివ్వబోమన్నారు. కార్మిక సంఘాల పోరాటాలకు కేంద్రం దిగిరాక తప్పదని పేర్కొన్నారు. టిడిపి విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ నాయకులు ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ భారీ వర్షంలోనూ పాదయాత్రను స్ఫూర్తిదాయకంగా నడపడం విశాఖ ఉక్కు కార్మికులకే చెల్లిందని అన్నారు. ఉక్కు పోరాటం తప్పక విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, చైర్మన్లు డి.ఆదినారాయణ, ఎం.రాజశేఖర్‌, సిపిఎం కార్పొరేటర్‌ బి.గంగారావు, సిఐటియు, జనసేన, ఆమ్‌ఆద్మీ, పబ్లిక్‌ సెక్టార్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

visakha steel plant march in heavy rain ch narasingaraovisakha steel plant march in heavy rain ch narasingarao