
- శుక్రవారం వాదనలు వింటామన్న న్యాయమూర్తి
ప్రజాశక్తి - హైదరాబాద్, కర్నూలు బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. వాదనలకు ఎంత సమయం పడుతుందని వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి అడ్డగా..గంట సమయం పడుతుందని న్యాయవాదులు తెలపడంతో శుక్రవారం ఉదయం 10.30కు వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. అవినాష్‌రెడ్డి ఏప్రిల్‌లో దాఖలుచేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ.. రోజూ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. రాతపూర్వకంగా ప్రశ్నావళి ఇవ్వాలని సిబిఐని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేస్తూ తాజాగా విచారణ చేపట్టాలంటూ ఏప్రిల్ 24న ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్ 27, 28 తేదీల్లో విచారణ చేపట్టినా వాదనలు పూర్తికాకపోవడంతో జూన్ ఐదునాటికి వాయిదా వేశారు. అయితే ఇందులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ జారీచేయడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ సిబిఐ నోటీసులు జారీ చేయడంతో అవినాష్‌రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 25న విచారణ చేపట్టి అవసరమైన ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించింది.
- కరూులులో వీడని ఉత్కంఠ
హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్నూలులో ఉత్కరఠ నెలకొంది. తీర్పు వెలువడిన వెంటనే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం కొనసాగడంతో విశ్వభారతి ఆస్పత్రి వద్ద వైసిపి శ్రేణులు నానా హంగామా సృష్టించారు. ఆస్పత్రి, పరిసర ప్రాంతాలకు వైసిపి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు వారికి పహారా కాశారు. మరో వైపు అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని, వాంతులు కూడా తగ్గాయని అందులో పేర్కొన్నారు. ఆమెను ఐసియు నుంచి సాధారణ వార్డుకు తరలించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ నెల 19న లక్ష్మమ్మను కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చేర్చడంతో అవినాష్‌రెడ్డి కూడా అక్కడే ఉన్న సంగతి తెలిసిందే.
- న్యాయం జరగాలి : కెఎ పాల్
అవినాష్‌రెడ్డికి న్యాయం జరగాలని, ఆయన తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం బాగుపడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ.పాల్ పేర్కొన్నారు. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్‌రెడ్డి తల్లిని గురువారం ఆయన పరామర్శించారు. టర్కీ వెళ్లాల్సిన వాడిని విమలరెడ్డి వీడియో చూసి కర్నూలు వచ్చానన్నారు. వివేకానందరెడ్డికి న్యాయం జరగాలని, కానీ అన్యాయంగా నిర్దోషిని దోషిగా చూపించకూడదని అన్నారు.