Sep 21,2022 15:27

మాస్కో  :  పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బుధవారం ప్రకటించారు. ఇటీవల ఉక్రెయిన్‌ సైన్యం ఎదరుదాడికి దిగుతూ రష్యా ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. టెలివిజన్‌లో మాట్లాడుతూ... ఈ ప్రకటన చేశారు. రష్యా, దాని భూభాగాలను రక్షించడానికి రెండు మిలియన్ల మేర సైనిక శక్తిని సమీకరిస్తున్నామని అన్నారు. రష్యాను పశ్చిమ దేశాలు నాశనం చేయాలనుకుంటున్నాయని,  ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పాలనుకోవడం లేదని అన్నారు. ''సొంత దేశాన్ని, దాని సార్వభౌమత్వాన్ని కాపాడటం కోసం పాక్షిక సైనిక సమీకరణ చేపట్టాలన్న నిర్ణయానికి రక్షణ శాఖ మద్దతుఇవ్వాలని కోరుకుంటున్నాం'' అని అన్నారు. ఇప్పటికే డిక్రీపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌, అక్కడి ప్రజలకు విముక్తి కలిగించడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ సైనిక సమీకరణ నేటి నుంచే మొదలవుతుందని తెలిపారు.

పశ్చిమ దేశాలు రష్యాపై అణు బెదిరింపులకు పాల్పడుతున్నాయని.. అయితే  దీనిపై స్పందించేందుకు మాస్కో వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.  తమ ప్రజలను రక్షించుకోవడానికి అన్ని వనరులు వినియోగిస్తామని స్పష్టం చేశారు.  ఈ అంశంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు స్పందిస్తూ ఇప్పటికే సైనిక శిక్షణ పొందిన వారిని కూడా దీనిలో చేర్చుకొంటామని చెప్పారు.  రష్యా 2014లో పాక్షికంగా ఆక్రమించుకున్న డాన్‌బాస్‌ ప్రాంతంలోని లుహాన్స్క్‌ డోనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించేందుకు సిద్ధమైంది. అయితే ఉక్రెయిన్‌, పశ్చిమదేశాలు మాత్రం రష్యా ఈ ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించుకుందని ఆరోపిస్తున్నాయి.