
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజ సంస్థ వొడాఫోన్ ఉద్యోగులపై వేటుకి సిద్ధమైంది. దీంతో రాబోయే మూడేళ్లలో 11,000 ఉద్యోగులను తొలగించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు ఆ కంపెనీ నూతన సిఇఒ మార్గరెట్ డెలా వలె తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ రాబడిలో వఅద్ధి కొరవడుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. దీంతో లేఆఫ్స్ దిశగా కసరత్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. 11,000 మంది ఉద్యోగులు అంటే కంపెనీ ప్రపంచ వర్క్‌పోర్స్‌లో 10 శాతానికి పైగా ఉంటుంది. గతేడాది ఈ సంస్థలో 1,04,000 సిబ్బంది ఉన్నారు.
తమ సామర్ధ్యం తగినంతగా లేదని, నిరంతరం మెరుగైన సేవలు అందించే క్రమంలో వొడాఫోన్ విధిగా మారాలని డెలా వలె ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కస్టమర్లు, నిరాడంబరంగా ఉంటూ మెరుగైన వృద్ధి రేటే తన ప్రాధాన్యతలని ఆమె వివరించారు. మార్కెట్‌లో పోటీతత్వానికి దీటుగా నిలబడేందుకు సంస్ధను సరళతరం చేస్తామని, కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు అనుగుణంగా వనరులను తిరిగి కేటాయిస్తామని చెప్పారు.
కంపెనీ షేర్ ధరల పతనంతో గత ఏడాది డిసెంబర్‌లో వొడాఫోన్ సిఇఒ నిక్ రీడ్ పదవి నుంచి వైదొలగడంతో.. వొడాఫోన్ తాత్కాలిక సిఇఒగా మార్గరెట్ బాధ్యతలు చేపట్టారు.