Aug 06,2022 21:15
  • నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి : వి.శ్రీనివాసరావు
  • '75 ఏళ్ల స్వాతంత్య్రాంనేటి కర్తవ్యం' సదస్సులో పలు పుస్తకాల ఆవిష్కరణ

ప్రజాశక్తి- భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : స్వాతంత్రోద్యమంలో ఎటువంటి పాత్రా లేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఆనాటి స్వాతంత్రోద్యమాన్ని, పోరాటాలను, త్యాగాలను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ తరానికి స్వాతంత్రోద్యమ గొప్పతనాన్ని తెలియజేసి, వచ్చే తరానికి మెరుగైన, ఉన్నతమైన నవ సమాజ స్థాపనకు నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని కోరారు. 'స్వాతంత్రోద్యమం-75 ఏళ్ల స్వాతంత్య్రం-నేటి కర్తవ్యం' అనే అంశంపై పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆధ్వర్యాన శనివారం జరిగిన జిల్లా స్థాయి సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గని ప్రసంగించారు. భారతీయులంతా కుల, మతాలకు అతీతంగా ఐక్యంగా దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గన్నారని తెలిపారు. ఎందరో త్యాగధనుల ప్రాణ త్యాగం ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, అంబేద్కర్‌, భగత్‌సింగ్‌, సుభాష్‌చంద్రబోస్‌ వంటి వారు కీలకపాత్ర పోషించారని తెలిపారు. సుమారు వందేళ్లలో 30 వేల మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. హిందూత్వ ముసుగులో నేడు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేస్తున్నాయని విమర్శించారు. 1928లో స్థాపించబడిన ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్రోద్యమంలో పాల్గనకుండా ఆనాడు ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేసిన వారంతా తమవారేనని ఇప్పుడు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నాడు ఉద్యమానికి ద్రోహం చేసిన వారు నేడు స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జాతీయ జెండాను 2002 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఎగరేయకపోవడం సిగ్గుచేటన్నారు. భారత రాజ్యాంగాన్ని నేటికీ ఆమోదించని హీనమైన చరిత్ర ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంఘాలకు ఉందని తెలిపారు. దేవుడి పేరుతోనూ, ఆహారం పేరుతోనూ ఇతర మతస్తులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. ఏ లక్ష్యాల కోసమైతే స్వాతంత్య్ర పోరాటంలో నాటి యోధులు ప్రాణాలు అర్పించారో ఆ లక్ష్యాలు నేటికీ నెరవేరలేదని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంపై ముద్రించిన నాలుగు పుస్తకాలను శ్రీనివాసరావు ఆవిష్కరించారు. వీటిలో ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్‌.వెంకట్రావు రచించిన భారత స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర, జ్యోతిబసు, ఇర్ఫాన్‌ హబీబ్‌ రచించిన భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం పుస్తకం, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రచించిన 75 ఏళ్ల స్వాతంత్య్రం ఉద్యమం, కేరళ మాజీ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్‌ రచించిన జాతీయ సమగ్రత-సమస్యలు పుస్తకాలు ఉన్నాయి. ఆచంట మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌ రాజ్యాంగంలోని ప్రధాన పీఠిక ప్రతిజ్ఞను అందరితో చేయించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.కల్యాణి తదితరులు పాల్గన్నారు.