
- తొమ్మిదో రోజుకు చేరిన ప్రచారోద్యమం
ప్రజాశక్తి-యంత్రాంగం : బిజెపి ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకొనేందుకు దేశరక్షణ భేరి పేరుతో సిపిఎం చేపట్టిన ప్రచారోద్యమం గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలను ప్రజలకు వివరిస్తూ సిపిఎం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, పాదయాత్రలు, సమావేశాలు నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 24న విజయవాడ జింఖనా గ్రౌండ్‌లో జరిగే 'దేశ రక్షణ భేరి' బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ముఠా కార్మికులతో నిర్వహించిన విస్తృత సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడారు. భారతదేశం సంక్షేమ రాజ్యం కావాలంటే మోడీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసి, బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్‌తో సహా అన్నింటిని ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.బాబూరావు మాట్లాడుతూ 24న జరిగే బహిరంగ సభలో సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని, కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలంలో ఆటో జాతా, మైలవరంలో బైక్ ర్యాలీ, గంపలగూడెం మండలంలో కరపత్రాలు పంపిణీ చేశారు.

కడపలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ మోడీ పాలనలో దేశంలోని అన్ని రంగాలు అధోగతి పాలయ్యాయని పేర్కొన్నారు. బియ్యం, పాలు, నూనెలు, పప్పు దినుసులతో సహా అన్ని వస్తువులపై జిఎస్‌టి పేరుతో భారం మోపారని విమర్శించారు. దేశ భక్తి పేరుతో మతవిద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జీపు జాతాను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ ప్రారంభించారు. బిజెపి విధానాల వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు కరపత్రాలు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో ప్రచార జాతాను ప్రారంభించారు. శ్రీకాకుళంలోని మొండేటి వీధి, దమ్మలవీధి, గొల్లవీధి, కంచిలి మండలం బూరగాం, ఎచ్చెర్లలో పాదయాత్ర చేశారు. పలాస మండలంలో ప్రచార యాత్ర చేపట్టారు.
విశాఖ జిల్లాలోని తగరపువలస జంక్షన్‌లోనూ, ఆరిలోవలోనూ పోస్టర్లు ఆవిష్కరించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ నుండి ఎన్‌టిఆర్ స్టేడియం, చిన్న నాలుగు రోడ్ల జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా రింగ్ రోడ్డు వరకూ ప్రదర్శనగా వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రచార యాత్రను ప్రారంభించారు. తుళ్లూరు, నిడమర్రులో జీపుజాతా, ఫిరంగిపురంలో ఆటో జాతా, మంగళగిరి, తాడికొండ, పల్నాడు జిల్లా అమరావతి, ముప్పాళ్లలో ప్రచారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 'మోదీ పాలన మాకొద్దు' అంటూ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శించారు. ఏలూరు, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ప్రచార జాతాలు నిర్వహించారు. అమలాపురం, అమలాపురం రూరల్ మండలాల్లో సిపిఎం రాష్ట్ర నాయకులు ఆండ్ర మాల్యాద్రి పాల్గొని మాట్లాడారు. నంద్యాలలో పాదయాత్ర నిర్వహించారు. ఆత్మకూరు, ప్యాపిలి మండలాల్లోనూ ప్రచార జాతాలు సాగాయి. కర్నూలు జిల్లా దేవనకొండ, ఆదోనిలో ప్రచార యాత్రలను ప్రారంభించారు. నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వ్యాప్తంగా ప్రచారభేరి కార్యక్రమాలు కొనసాగాయి.

