Nov 25,2022 15:52

ప్రప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ డిసెంబర్ 8,9,10 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జంగారెడ్డిగూడెంలో జరుగనున్నాయని 2023 ఫిబ్రవరిలో ఆల్ ఇండియా మహాసభలు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హౌరాలో జరుగనున్నట్లు తెలిపారు. డిసెంబర్ ఎనిమిదో తేదీన జంగారెడ్డిగూడెంలో జరిగే  బహిరంగ సభలో  సంఘం అద్యక్ష, కార్యదర్శులు విజయ రాఘవన్, బృందా కారత్, కేరళ వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ కూలీల ఉపాధి హామీ అమలు తీరుతెన్నులు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యకలాపాలు రూపొందిస్తారని అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రానున్న మూడు సంవత్సరాల కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు ఈ మహాసభలు వేదిక కానున్నాయన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులు, వ్యవసాయ కూలీలు ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని కేంద్ర ప్రభుత్వం సంస్కరణ పేరుతో దెబ్బతీస్తుందన్నారు. వ్యవసాయ రంగం దెబ్బతినేలా విద్యుత్ సమస్యల లాంటి చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. 1934లో మహానేత పుచ్చలపల్లి సుందరయ్య నిర్మించిన వ్యవసాయ కార్మిక సంఘం నేడు దేశీవ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం గా వ్యవసాయ కూలీల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం వ్యవసాయ కార్మిక సంఘమే అని అన్నారు. భూమిపంచాలి, కూలి పెంచాలి అనే నినాదంతో వ్యవసాయ కార్మికులకు అండగా నిలబడ్డ సంఘం వ్యవసాయ కార్మిక సంఘం అని పేర్కొన్నారు. ఈ సంఘం రాష్ట్ర మహాసభలకు అందరూ సహకరించి పెద్ద ఎత్తున ఎనిమిదో తేదీన జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బల్ల చినవీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు మరపట్ల దానయ్య తదితరులు పాల్గొన్నారు.