Nov 24,2022 08:46
  • అట్టడుగున గుజరాత్‌, ఎంపి

ముంబయి : ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు అన్నీ పెరుగుతున్న సమయంలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వ్యవసాయ కార్మికులకు దేశంలోనే అత్యంత తక్కువగా రోజువారీ వేతనాలు చెల్లిస్తున్నారు. అదే సమయంలో కేరళ, జమ్మూ కాశ్మీర్‌ల్లో వ్యవసాయ కార్మికులు అత్యధిక స్థాయిలో వేతనాలు పొందుతున్నారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) సేకరించిన డేటా ప్రకారం, మధ్యప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పురుష కార్మికులకు రోజువారీ వేతనం కేవలం రూ.217.8గా వుంది. అదే గుజరాత్‌లో రూ.220.3గా వుంది. 2022 మార్చితో ముగిసిన ఏడాదిలో వేతన చెల్లింపులు ఈ రీతిన వున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని రోజువారీ వేతనాలు జాతీయ సగటు రూ.323.3 కన్నా తక్కువగానే వుండడం గమనార్హం. గుజరాత్‌లో గ్రామీణ రైతాంగ కార్మికుడు నెలలో 25 రోజులు పనిచేస్తే నెలవారీ వేతనం రూ.5,500గా వుంటుంది. నలుగురు లేదా ఐదుగురు సభ్యులు గల ఒక కుటుంబం అవసరాలు తీరడానికి ఈ మొత్తం ఏమాత్రమూ సరిపోదు.
కేరళలో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మికునికి అన్ని రాష్ట్రాల్లో కన్నా అధికంగా వేతనం అందుతోంది. నెలలో 25 రోజులు పనిచేస్తే ఆ కార్మికునికి వచ్చే సగటు వేతనం రూ.18,170గా వుంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు పోవడం, ఆదాయాలు పడిపోవడంతో 2021-22లో గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. మధ్య ప్రదేశ్‌లో వ్యవసాయ కార్మికుని నెలవారీ వేతనం రూ.5,445గా వుంది. ఉత్తరప్రదేశ్‌లో సగటు రోజువారీ వేతనం రూ.270 కాగా, మహారాష్ట్రలో రూ.282.2, ఒడిషాలో రూ.269.5గా వుంది. కేరళ వీటన్నింటి కన్నా అగ్ర స్థానంలో వుంది. అక్కడ సగటు వేతనం రూ.726.8గా వుంది. కేరళలో అధిక వేతనాలు ఆకర్షణీయంగా వుండడంతో ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు అక్కడకు వలస వెళుతున్నారు. దాదాపు 25లక్షల మంది వలసకార్మికులు ప్రస్తుతం కేరళలో వున్నట్లు అంచనా. జమ్మూ కాశ్మీర్‌లో రైతాంగ కార్మికుని సగటు వేతనం రూ.524.6గా వుండగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో రూ.457.6, తమిళనాడులో రూ.445.6 గా వుంది. వ్యవసాయేతర కార్మికుల విషయానికొస్తే, పురుషులకు ఇచ్చే వేతనం మధ్యప్రదేశ్‌లో అత్యంత తక్కువగా వుంది. సగటు రూ.230.3గా వుంది. గుజరాత్‌ కార్మికులు రూ.252.5 తీసుకుంటుండగా, త్రిపురలో రూ.250 ఇస్తున్నారు. ఇవన్నీ కూడా జాతీయ సగటు రూ.326.6 కన్నా తక్కువగానే వున్నాయని ఆర్‌బిఐ డేటా పేర్కొంది. వ్యవసాయేతర కార్మికుల వేతనాల విషయంలో కూడా కేరళ టాప్‌లోనే వుంది. అక్కడ ఒక కార్మికుని వేతనం రూ.681.8గా వుంది. ఆ తర్వాత స్థానం జమ్మూ కాశ్మీర్‌దే. అక్కడ రూ.500.8గా వుండగా, తమిళనాడులో రూ.462.3, హర్యానాలోరూ.409.3గా వున్నాయి.