Nov 25,2022 15:56

న్యూఢిల్లీ   :   కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో శుక్రవారం ఆశ్చర్యంగా ప్రత్యేక అతిధి భాగమైంది. పది నెలల జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన కుక్క మార్వెల్‌ ఈ యాత్రలో పాల్గొంది. మార్వెల్‌ గ్వాలియర్‌లోని తమ నివాసం నుండి బయలుదేరింది. తన యజమాని రజత్‌ పరాశర్‌తో బైక్‌ వెనుక కూర్చున్న మార్వెల్‌ గాగుల్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది.   వారిద్దరూ ఇప్పటికే బైక్‌పై 15వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశాన్ని చుట్టివచ్చారు.  ఈ యాత్ర ప్రత్యేకమైందని సివిల్‌ ఇంజనీర్‌ అయిన పరాశర్‌ పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే... వన్యప్రాణుల హక్కులను సంరక్షించాల్సిందిగా రాహుల్‌ గాంధీని కోరతానని అన్నారు. అయితే తాను రాహుల్‌ను కలుసుకోలేకపోయానని చెప్పారు. తాము రాహుల్ యాత్రకు సంఘీభావంగా బైక్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.  కాశ్మీర్‌ వరకు సాగే ఈ యాత్రలో తాము పాల్గొంటామని.. రాహుల్ ని కలిసి తీరతామని ఆశాభావం వ్యక్తం చేశారు.