
కోల్‌కతా : రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ఆందోళనలను చేపట్టనున్నట్లు పశ్చిమబెంగాల్ సెంటర్ ఫర్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) ప్రకటించింది. అవినీతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేయనున్నట్లు వెల్లడించింది. కోల్‌కతాలోని శ్రామిక్ భవన్‌లో నిర్వహించిన రెండు రోజుల సదస్సులో సిఐటియు ఈ మేరకు ప్రకటించింది.
జూన్ 21, 22 తేదీల్లో జిల్లా వ్యాప్త ఆందోళనల్లో భాగంగా తమ సభ్యులు జిల్లా మెజిస్ట్రేట్స్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 8, 9 తేదీల్లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎస్ప్లానేడ్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు పేర్కొంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తూ జులై, ఆగస్ట్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు కాలనీలు, వీధుల చివర్లలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కార్మిక వర్గాలను మతపరంగా విభజిస్తూ.. వారి ఐఖ్యతను బలహీన పరిచే ప్రయత్నం జరుగుతోందని, ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాదాన్ని తిప్పికొట్టేందుకు ప్రతి జిల్లాలోనూ సిఐటియు నేతృత్వంలో వర్క్‌షాప్‌లను నిర్వహించాల్సి వుందని ఈ సదస్సు భావించింది.
పిఎస్‌యు ఆస్తులను కార్పోరేట్లకు బదిలీ చేయకుండా కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు రైతులు, శ్రామిక వర్గాలు ఐక్యంగా ఉద్యమం చేపట్టాల్సి వుందని ఈ సదస్సు పిలుపునిచ్చింది. గతంలో సిఐటియు నేతృత్వంలో చేపట్టిన పోరాటంతో అల్లాయ్ స్టీల్స్ ప్లాంట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులను ఉపసంహరణను నిరోధించగలిగిందని, కార్మిక వర్గాల్లో కొత్త ఆశను కల్పించిందని గుర్తు చేసింది.
కార్మిక వర్గంతో బలమైన సంబంధాల ఆవశ్యకతను సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ఉద్ఘాటించారు. కేంద్రం, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని అన్నారు. ఇటువంటి విధానాల వల్ల కలిగే నష్టాలను కార్మికవర్గం గుర్తిస్తే తప్ప ఉద్యమాన్ని ప్రారంభించలేమని అన్నారు. శ్రామిక వర్గానికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు బలమైన ఉద్యమం అవసమని తపన్‌సేన్ పునరుద్ఘాటించారు. ప్రముఖ సిఐటియు నేత దీపక్ దాస్ గుప్తా రచించిన హౌరా జిల్లాల్లో కార్మిక ఉద్యమం పుస్తకంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దేబంజన్ చక్రవర్తి రాసిన పుస్తకాన్ని ఈ సదస్సులో ఆవిష్కరించారు.
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సిఎల్‌డబ్ల్యు)కి కొత్త కాంట్రాక్టులు రావడం లేదని, వందే భరత్ రైళ్ల కాంట్రాక్టును కూడా రష్యన్ కంపెనీ దక్కించుకుందనిసిఐటియు జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేబంజన్ చక్రవర్తి అన్నారు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌కి చెందిన సుమారు 3,500 మందికి పైగా కాంట్రాక్ట్ వర్కర్లు ఉపాధిని కోల్పోయారని అన్నారు. తేయాకు తోటల్లో అధికంగా కాంట్రాక్ట్ వర్కర్లను నియమిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దోపిడీతో సిఐటియు ఎంత ప్రయత్నించినా కనీస వేతనాల్లో ఎలాంటి పెరుగదల కనిపించడం లేదని అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా పలు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, దీనిపై రాష్ట్రపతికి, ప్రధానికి మెమోరాండం పంపినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
సదస్సు ముగింపు ప్రసంగంలో రాష్ట్ర సిఐటియు కార్యదర్శి అనాది సాహు మాట్లాడుతూ.. మతతత్వ శక్తులను ఎదుర్కోవడానికి, జీవనోపాధి కోసం రంగాల వారీగా ఉద్యమాలను చేపట్టాలని అన్నారు. పంచాయితీ ఎన్నికలకు ముందు కార్మికవర్గ ఐక్యతను పెంపొందించడంలో సిఐటియు నిర్ణయాత్మక ప్రాతను పోషిస్తుందన్నారు.