
ఇంటర్నెట్ డెస్క్ : దేశంలో యూపీఐ లావాదేవాలు గతంలో కంటే మరింత పెరిగాయి. కోవిడ్ వల్ల లాక్‌డౌన్ పుణ్యాన డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి సంస్థల సేవలు విస్తరించాయి. ప్రస్తుతం ఈ మూడు సంస్థలే అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో వాట్సాప్ చాలా వెనుకబడి ఉంది. యూజర్లకు పేమెంట్స్ సేవల్ని కూడా విస్తరించేలా వాట్సాప్ సిద్ధమైంది. ఇటీవలే 10 కోట్ల మంది వరకు పేమెంట్ సేవలను విస్తరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ప్రజలకు చేరువ కానుంది.
మే చివరికి నాటికి వాట్సాప్‌లో క్యాష్‌బ్యాక్ సదుపాయం అందుబాటులోకి రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదటగా యూజర్లను ఆకట్టుకునేందుకు ఒక్కో యూజర్‌కు రూ. 33 చొప్పున క్యాష్‌బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. మూడు లావాదేవీలకుగాను రూ. 33 క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నారట. అయితే, ఈ క్యాష్‌బ్యాక్ చూడ్డానికి తక్కువగా ఉన్నా.. యూజర్లు వాట్సాప్ పేమెంట్స్‌కు మారడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే యూజర్లకు మరింత చేరువయ్యేందుకు.. రిలయన్స్ జియో రీఛార్జి చేసుకున్నా క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో పేమెంట్స్ విభాగంలో అమెరికా వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌పే హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వాట్సాప్‌లో పేమెంట్స్ సేవలు అందుబాటులోకి వచ్చినా.. యూజర్లకు విస్తరించడంపై పరిమితి ఉంది. తాజాగా వాట్సాప్ పేమెంట్స్ సేవల్ని 10 కోట్లకు విస్తరించుకునేందుకు ఎన్‌పీసీఐ అనుమతి ఇవ్వడంతో.. మార్గం సుగమమైంది. ప్రస్తుతం భారత్‌లో వాట్సాప్‌కు 50 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. కేవలం మెసేజింగ్, ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవడానికి అలవాటు పడిన వాట్సాప్ యూజర్లు.. పేమెంట్ సేవలకు అలవాటు పడితే.. మిగతా పేమెంట్స్ కంపెనీలకు భవిష్యత్తులో కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు.