Aug 05,2022 07:01

ఇంటిపక్కనే పాఠశాల ఉండాలని తల్లిదండ్రులు కోరుకోకూడదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం ఆక్షేపణీయం. ఉన్న వీధిలోనే పాఠశాల ఉంటుందా? అని ప్రశ్నించిన ఆయన అమెరికాలో మంచి పాఠశాల ఉన్నచోట తల్లిదండ్రులు ఇళ్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పడంలోనే ఆయన వాదనలోని డొల్లతనం విదితమవుతోంది. నిజానికి ప్రాథమిక పాఠశాల ఇంటికి కొనసాగింపుగా ఉండాలి. ఇది ప్రధాన సూత్రం. దాన్ని విస్మరించి మంత్రి ఇంకేదో మాటాడడం సబబు కాదు. పిల్లలను ప్రైవేటు కాన్వెంట్‌కు పంపుతున్న తల్లిదండ్రులు సైకిల్‌, స్కూటర్‌పై వారిని దింపి పనికి వెళ్తున్నారని చెప్పారు. ఇది కొద్దిమేరకు వాస్తవం కావచ్చు. కాని అత్యధికులుగా ఉన్న పేద తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లలను బడికి వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి లేదని అమాత్యులకు తెలియదా? లేక వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? ప్రాథమిక పాఠశాల దూరమైతే బలహీనవర్గాల పిల్లలు విద్యకు దూరమైపోతారు. అంటే తరగతుల విలీనం సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగించడమే.
               దూరం పెరగడం మాత్రమేగాక ఆ పాఠశాలకు చేరాలంటే వాగులు, వంకలు, రైల్వే లెవెల్‌ క్రాసింగులు దాటాల్సి రావడమో లేక జాతీయ/రాష్ట్ర రహదారిలో వెళ్లాల్సిన పరిస్థితి వుంటేనో వారి భద్రతకు ముప్పు కలుగుతుంది. పిల్లలకు భద్రత ఒక హక్కు, తరగతుల విలీనం పేరిట సర్కారు దాన్ని కాలరాస్తోంది. పాఠశాల అందుబాటులో ఉండి పిల్లలకు భద్రత ఉండాలి. ఇది తప్పనిసరిగా ఉండాల్సిన సూత్రం. దానిని తోసిపుచ్చి ఇష్టమొచ్చిన చోట బడి పెడతామని, పిల్లలు అక్కడకు వెళ్లాలని చెప్పడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. చట్టం కాని జాతీయ విద్యా విధానాన్ని చూపిస్తూ విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేస్తున్నారు. ఈ తతంగమంతా పాఠశాలలను, టీచర్లను తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టిందన్నది స్పష్టమవుతోంది. మంత్రివర్యులు ఆ మాట నేరుగా చెప్పకుండా డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేయడం, ఉపాధ్యాయ సంఘాలను, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలను నిందించడం తగదు. ప్రభుత్వ విధానాన్ని, తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదన్న అమాత్యులు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలన్నింటినీ ప్రజాభిప్రాయంతో అమలు చేయాలంటే కుదరదని చెప్పేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారని, విలీన ప్రక్రియలో వారి అభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు. అంటే ప్రజాభిప్రాయం ప్రకారం కాకుండా ఎమ్మెల్యేల (అదీ అధికారపార్టీ వారి) అభీష్టాన్నిబట్టి సర్కారు నడుచుకుంటుందని అసలు విషయం వెల్లడించారు.
               అంతేగాక విలీనాన్ని కేవలం 0.1 శాతం మాత్రమే వ్యతిరేకిస్తున్నారనీ వారినిబట్టి ప్రభుత్వ విధానాన్ని మార్చుకోవాలా అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. కాని ఆయనే 5,800 పాఠశాలలను మ్యాపింగ్‌ చేశామని, వాటిల్లో 820 పాఠశాలలపై అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. లెక్కిస్తే ఇది మంత్రివర్యులన్నట్టు 0.1 శాతం కాకుండా 14.13 శాతం వుంది. అంటే అంతకు 140 రెట్లు ఎక్కువ. ఈ అభ్యంతరాల సంఖ్య వాస్తవంగా ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ సర్కారు ఏవేవో కాకి లెక్కలు చెబుతోంది. కాబట్టి విలీనంపై పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలతో తీర్మానం చేయిస్తే ఎంత మంది ఒప్పుకుంటున్నారో తెలుస్తుంది. కాని, ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు, కనీసం సర్పంచుల అభిప్రాయాలు అడగటానికి సైతం ఎందుకు వెనుకాడుతుందన్నది సామాన్యుల ప్రశ్న. జిఓ 117 ప్రకారం నమోదు 98 కంటే తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎస్‌జిటిలను మాత్రమే ఇస్తూ సబ్జెక్టు ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించడానికే విలీనమని సర్కారు చెప్పడం మోసపూరితం. అది కూడా 8 తరగతులకు గరిష్టంగా నలుగురు ఉపాధ్యాయులను మాత్రమే కేటాయిస్తోంది. ఇలా...విలీనంపై సర్కారు చేస్తున్న వాదనలు, చెబుతున్న మాటలు 'తాడి చెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం' అన్న సామెతను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గుర్తించి, గౌరవించి విలీన ప్రక్రియను నిలిపివేయడం విజ్ఞతగా ఉంటుంది.