Nov 29,2022 08:13

రుపేద రైతు కుటుంబంలో పుట్టి, పెరిగిన సుకారి నాగ్‌ తండ్రి మరణంతో బాల్యంలోనే కుటుంబ బాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్లకే పెళ్లి. మూడేళ్లలోనే భర్త మరణం. దాంతో మానసికంగా, ఆర్థికంగా చితికిపోయారు. అయినా కష్టాలకు లొంగిపోకుండా, అత్త ఇచ్చిన ధైర్యంతో తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. పశువుల పెంపకంలో తన అనుభవమే తన జీవితానికి మార్గనిర్దేశమయింది. స్వయం సహాయ సంఘంలో చేరి తన ఆదాయం పెంచుకోవడమే కాకుండా గ్రామంలోని మహిళల అభివృద్ధికీ కృషి చేస్తున్నారు. ఆమె జీవిత కథను ఆమె మాటల్లోనే...

'మాది ఛత్తీస్‌గడ్‌లో బస్తర్‌ జిల్లా, నెగనార్‌ గ్రామం. మారుమూల ప్రాంతం. మేము ఐదుగురం అక్కచెల్లెళ్లం. నేను రెండోవదాన్ని. తోబుట్టువులతో కలిసి ఆటలు ఆడుకుంటూ బాల్యాన్ని అందంగా ఊహించుకునేదాన్ని. నాకు ఎనిమిదేళ్ల వయసులో భూ వివాదాల కారణంగా మా నాన్నను హత్య చేశారు. ఆ గొడవలు మాకు ఏం అర్ధమయ్యేవి కాదు. నాన్న చనిపోయాక మా ఇంట్లో ఏదో తెలియని లోటు. అందరం ఆడపిల్లలం. అమ్మకు చేదోడుగా నిలిచాం. చదువు ప్రారంభంలోనే నిలిచిపోయింది. నేనూ, అక్కా కలిసి మా చెల్లెళ్ల బాగోగులు చేసుకునేవాళ్లం. అమ్మ కూలి పనులకు వెళ్లేది. ఇంటి దగ్గర పశువులను, కోళ్లను పెంచేవాళ్లం. పశువుల దగ్గర పేడ ఎత్తడం, గడ్డి కోయడం అప్పుడే అలవాటు చేసుకున్నా. కట్టెలు కొట్టి తెచ్చేదాన్ని. దూరం నుంచి నీళ్లు మోసేదాన్ని. సాయంత్రానికి ఒళ్లంతా నొప్పులొచ్చేవి. పదేళ్ల వయసులోనే వ్యవసాయ పనులకు వెళ్లాను. మా బాధలను చూసి 'నాన్న ఉంటే మనకిన్ని కష్టాలుండేవి కాదు' అని అమ్మ ఏడ్చేది.
 

                                                                    అత్తయ్య మళ్లీ పెళ్లి చేసింది

మా ఆర్థిక సమస్యల కారణంగా నాకు 16 ఏళ్ల వయసులో పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టా. ఏడాది తర్వాత మగపిల్లాడు పుట్టాడు. పెళ్లైన మూడో ఏడే నా భర్త క్షయవ్యాధితో చనిపోయాడు. దాంతో నా చుట్టూ చీకటి అలముకున్నట్లైంది. భర్త తోడు లేకుండా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో అమ్మను చూశాక అర్ధమైంది. అదే పరిస్థితి నాకు వచ్చాక నాకు బతకాలనిపించలేదు. కాని బిడ్డ కోసం తప్పుదనుకున్నా. మాకు రెండెకరాల భూమి ఉంది. కానీ దిగుబడి చాలా తక్కువ. తిండి గింజల కోసం వరి సాగు చేశా. పెట్టుబడి పోనూ రూ.600 సంపాదించాను. ఈ ఆదాయం సరిపోదు. అందుకు అడవులకు వెళ్లి కట్టెలు కొట్టి అమ్మేదాన్ని. ఇవన్నీ కుటుంబ అవసరాలు మాత్రమే గడిచేవి. బిడ్డను చంకలో వేసుకుని కూలి పనులకూ వెళ్లేదాన్ని. నా బాధలు చూసి మా అత్త మళ్లీ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఆ ఊరిలోనే రైతు సోమా బాగెల్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. నన్నూ, నా బిడ్డను అతను బాగా చూసుకుంటున్నారు.
 

                                                            స్వయం సహాయక సంఘాల ప్రాముఖ్యత

గ్రామంలో నీటి ఎద్దడి కారణంగా వ్యవసాయం పెద్దగా అభివృద్ధిలో ఉండేది కాదు. నిత్యం కరువు తాండవిస్తూ ఉండేది. గ్రామాల్లో ప్రొఫెషనల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ యాక్షన్‌ కింద పనులు ప్రారంభించారు. ఎలాగైనా మా బతుకులు మారాలన్న ఉద్దేశంతో నేను ముందుకు అడుగు వేశా. చదువు లేకపోయినా ధైర్యంగా సమావేశాలకు హాజరయ్యా. స్వయం సహాయక సంఘాల ప్రాముఖ్యతను తెలుసుకున్నా. గ్రామంలో మహిళలకు వివరించాను. చిన్నతనంలో పశువుల పెంపకంలో నా అనుభవం తెలిసి నన్నే నాయకురాలిగా ఉండమన్నారు. ఈ సంఘాల పనితీరు, పశువుల సంరక్షణ చర్యలు తెలుసుకునేందుకు జార్ఖండ్‌లో గుమ్లా, కోడెర్మా వెళ్లి పరిశీలించాం. పశుపెంపకంలో మరికొంత శిక్షణా తీసుకున్నా.
 

                                                                      మగవారితో సమానంగా ...

ఆ అనుభవంతో గ్రామంలో నేను పశు సఖి (పారావేట్‌)గా పని చేయడం ప్రారంభించా. అధికారులు ఇచ్చిన పశువులను గ్రామస్తులకు పంపిణీ చేసి, వారి కుటుంబ ఆదాయానికి ప్రోత్సహించా. ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామంలో ఏర్పాటు చేసిన కొన్ని గ్రూపులకు నేను నాయకత్వం వహిస్తూ బాధ్యత చేపట్టా. వారందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘాలను నడిపిస్తున్నా. కోళ్లు, మేకలకు రోగాలు, వ్యాధులు ప్రబలకుండా వ్యాక్సిన్లూ ఇస్తా. వాటికి కావాల్సిన ఆహారం తీసుకు వస్తాను. వాటి బలానికి చర్యలు తీసుకుంటాం. ఈ పనులన్నీ ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా మగవారే చేస్తారు. కాని నేను వారితో సమానంగా బాధ్యత వహించడంతో అధికారులు అభినందించారు. దాంతో మంచి ఆదాయం వస్తోంది. మా ఊరిలోనే కాదు... పక్క గ్రామాలకు వెళ్లి వితంతువులు, ఒంటరి మహిళల అనుభవాలను తెలుసుకుని వారి కుటుంబ ఆదాయానికి దారి చూపే ప్రయత్నం చేస్తున్నా. వారిలో మా అమ్మను, నన్ను చూసుకుంటా. జీవితం ఎన్నో సవాళ్లను విసురుతుంది. వాటన్నిటికి భయపడితే ముందుకు వెళ్లలేం. ఎదుర్కొని ముందుకెళితే విజయం సాధిస్తాం.''