
ప్రజాశక్తి -పెనుకొండ : రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మహిళలు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని భావించే ప్రభుత్వం తమదని మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు.సోమవారం పట్టణంలోని వన్సిక ఫంక్షన్ హాల్ లో వై ఎస్ ఆర్ ఆసరా మూడవ విడుత సంబరాలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సానిపల్లి మంగమ్మ, జడ్పీ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.సంక్షేమ పథకాలు అమలుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. ఎన్నికలకు ముందు తీసుకున్న డ్వాక్రా రుణాల మాఫీకి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం మూడు విడతల్లో 19 వేలకోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు.గత ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు పాదయాత్రలో డ్వాక్రా మహిళల రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడని విమర్శించారు.కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదని ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా అమలు చేస్తున్నాడన్నారు.నాడు చంద్రబాబు మాట తప్పితే నేడు జగన్ మాట నిలబెట్టుకున్నాడన్నారు.త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయని మరలా మోసపూరిత హామీలతో ప్రతిపక్షాలు మీ ముందుకు వస్తాయని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మహిళలకు సూచించారు.అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పై ఎల్లో మీడియా ప్రతిరోజు దుష్ప్రచారం చేస్తోందని వారి రాతలు.. మాటలు నమ్మవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నాగలూరు బాబు, టౌన్ కన్వీనర్ బోయ నరసింహ, నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఫరూక్,వైస్ ఛైర్పర్సన్ సునీల్, జయ శంకర్ రెడ్డి, కౌన్సిలర్ లు,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.