Sep 29,2022 07:08
  • బాలలూ, టెలిఫోన్లు, రేడియోలు సమాచార సాధనాలకు సంబంధించిన ఒక ఇంజనీర్‌ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన అంశంలో కృషి చేశారు. ఆయన గురించి ఈ రోజు తెలుసుకుందామా!

బెకెసీ గియార్గాన్‌ 1899లో హంగేరీలో జన్మించారు. చదువు అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. జర్మనీలోని సీమన్స్‌ కంపెనీలో కొన్నాళ్లు ఇంజనీరుగా పనిచేశారు. తర్వాత స్వీడన్‌కు వెళ్ళి అక్కడ పరిశ్రమల్లో పనిచేస్తూనే బోధనా వృత్తిని కొనసాగించారు. చెవి, లోపలి యంత్రాంగం ఎలా పనిచేస్తుందో అప్పటి వరకు ఎవరూ వివరించలేదు. గాలిలోని ధ్వని తరంగాలు చెవిరంధ్రం ద్వారా ప్రయాణించి కర్ణభేరిని కదిలిస్తాయనీ, ఆ కంపనాలు చెవిలో ఉన్నప్పుడు చిన్న ఎముకల గొలుసు ద్వారా, కాక్లియాకు ప్రయాణిస్తాయనీ మాత్రమే తెలుసు. అయితే కాక్లియా ఎందుకు స్ప్రింగులాగా ఉందని గానీ ఆ తరువాత కాక్లియాలో ఏ చర్యలు జరగడం ద్వారా మెదడుకు సంకేతాలు వెళతాయన్న విషయం పట్ల ఎవరికీ అవగాహన లేదు.
యాంత్రిక సంకేతాలు విద్యుత్‌ సంకేతాలుగా మారడమెలాగో అర్థం కాలేదు. గియర్గాన్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అక్కడే చెవి పనిచేసే విధానం పట్ల లోతైన పరిశోధనలు చేశారు. కాక్లియా నమూనాలను తయారు చేసి ఆ నమూనా గోడలు మందాన్ని మారుస్తూ వాటిలో రకరకాల ద్రవాలను నింపి ఆ ద్రవాల్లో అల్యూమినియం పొడిని కలిపి విద్యుత్‌ సంకేతాలు పంపేవారు. ధ్వని తరంగాలను పంపి వివిధ ప్రాంతాల్లో వివిధ మోతాదుల్లో ధ్వని వ్యత్యాసాలు గుర్తించారు. ధ్వని తరంగాలు కాక్లియాలోని ద్రవం గుండా ప్రయాణిస్తూ కంపనాలను కలిగిస్తాయనీ పీజో ఎలక్ట్రసిటీ అనే దృగ్విషయం ద్వారా ధ్వని తరంగాలు విద్యుత్‌ తరంగాలుగా మారతాయనీ, అవి కర్ణనాడుల ద్వారా మెదడుకు చేరతాయని వివరించారు. ఈయన చేసిన కృషికి గుర్తింపుగా 1961లో నోబెల్‌ బహుమతి లభించింది. ఆయన రూపొందించిన సూత్రాల ఆధారంగానే వినికిడి యంత్రాన్ని తయారు చేశారు.