May 17,2022 15:51

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఒకప్పుడు శుభకార్యాలకైనా, చావులకైనా ఏ విషయానికి సంబంధించిన సమాచారం తెలియాలన్నా... ఎవరికైనా చెప్పాలన్నా.... చాలా రోజులు సమయం పట్టేది. అలాంటిది ఇప్పుడు.. సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. నిమిషాల్లో సమాచారం తెలిసిపోతుంది. కమ్యూనికేషన్‌ ఆ విధంగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలోనే 'టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ'కి కూడా ప్రత్యేకించి ఓ రోజును ఏర్పాటు చేశారు. ప్రతి యేడాది మే 17న ప్రపంచవ్యాప్తంగా టెలి కమ్యూనికేషన్‌ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఒక థీమ్‌ని ఎంపిక చేసి... ఆ ప్రకారం సాంకేతికత ఫలాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే కృషి జరుగుతుంటుంది. సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందుతున్నా... వృద్ధులు టెక్నాలజీని వాడడంలో చాలావరకు వెనుకబడే ఉన్నారు. అందుకే ఈ ఏడాది వృద్ధులను టెక్నాలజీపరంగా అభివృద్ధి చేసేవిధంగా ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసిటి) ఓ థీమ్‌ను రూపొందించింది. వృద్ధులు మానసికంగా, ఆర్థికంగా, స్వతంత్రంగా టెక్నిలజీని వాడే విధంగా అభివృద్ధి చేయాలనేది ఈ థీమ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో సాంకేతికత యొక్క పూర్వాపరాల్లోకి వెళితే...

చరిత్ర..
ప్రపంచవ్యాప్తంగా... వివిధ దేశాల మధ్య పరస్పర సమాచారం మార్పిడిగా దీన్ని భావించవచ్చు. ఒక దేశానికి సంబంధించిన సంస్కృతీ, సాంప్రదాయాలు, సామాజికంగానూ, ఆర్థికంగా యావత్‌ ప్రపంచ దేశాలకు తెలిసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఇలా సమాచారం తెలుసుకున్న తర్వాత.. మిగతా దేశాల సహాయ సహకారాలతో.. టెక్నాలజీ సహాయంతో ఆ దేశం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఇదే టెలికమ్యూనికేషన్‌ ప్రధాన లక్ష్యమని చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత ద్వారా వచ్చే అవకాశాలపై అవగాహన పెంచడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటగా అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ కన్వెన్షన్‌పై 1865 మే 17న పారిస్‌లో సంతకం చేశారు. ఆ తర్వాత 1968లో మొదటిసారిగా ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అందుకే తొలిసారి సంతకం చేసిన మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్‌ దినోత్సవంగా జరుపుకుంటారు. దీన్ని ప్రాధాన్యాతను యావత్‌ ప్రపంచ దేశాలు గుర్తించాలని 2005లో ట్యూనిస్‌లోని ఇన్ఫర్మేషన్‌ సొసైటీ శిఖరాగ్ర సమావేశంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య తీర్మానం ద్వారా ప్రకటించింది. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యాలు.

teli


మన దేశంలో..
మన దేశంలో ఉత్తరానికంటే అడ్వాన్స్‌గా టెలిగ్రామ్‌ వస్తే.. ఆ తర్వాత ఆధునికతతో టెలిఫోన్స్‌ వచ్చాయి. సాంకేతికతలో భాగంగా కంప్యూటర్‌.. ఆ తర్వాత ఇంటర్‌నెట్‌ వచ్చింది. సమాచారం... త్వరితగతిన చేరేలా ఇమెయిల్‌ వచ్చింది. ఇ మెయిల్‌ తర్వాత అరచేతిలో ఇమిడేంతగా సెల్‌ఫోన్‌ వచ్చింది. ఇప్పుడు సెల్‌ఫోన్‌లోనే అన్ని సదుపాయాలు మనముందున్నాయి. ప్రపంచంలో టెలి కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఉన్న దేశాల్లో రెండవ అతిపెద్దదిగా భారత్‌ ఉంది. జనవరి 31- 2021 నాటికి 1179.49 మిలియన్ల మంది టెలిఫోన్‌ వినియోగదారులున్నారు. భారత్‌లో మెగా టెలికాం ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంది. 747.41 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సబ్‌స్క్రైబర్‌లతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఇంటర్నెట్‌ యూజర్‌ బేస్‌ కలిగి ఉంది. అలాంటి దేశంలో ఇప్పటికీ నెట్‌వర్క్‌ సదుపాయం లేని కొన్ని వందల గ్రామాలున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే చైనా ముందడుగు వేసి 6జీవైపు వెళుతుంటే.. మన దేశం ఇంకా 4జీ -5జీ వరకే ఆగింది. టెక్నాలజీలో భాగంగా కరోనా సమయంలో విద్యార్థులు సెల్‌ఫోన్స్‌లోనే పాఠాలు విన్నారు. అయితే కరోనా కష్టకాలంలో అప్పుచేసి మరీ సెల్‌ఫోన్‌ కొనుక్కున్నా.. నెట్‌వర్క్‌ సదుపాయం లేక పాఠాలు సరిగ్గా వినలేని పరిస్థితి దాపురించింది. దాంతో డ్రాపవుట్స్‌ కూడా మరిన్ని పెరిగాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఒకవైపు టెక్నాలజీపరంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆ అభివృద్ధి ఫలాలకు ఆమడదూరంలో కొంతమంది ఉండిపోతున్నారు. మన దేశంలోని ప్రజలందరికీ పేద - ధనిక అనే తేడా లేకుండా సాంకేతికాభివృద్ధి జరిగితేనే అభివృద్ధి జరిగినట్టు లెక్క. ఆ దిశగా ప్రభుత్వం, పాలకులు దృష్టి సారించాలి. ప్రపంచ సాంకేతికతలో మన దేశం కూడా పోటీపడాలి. అప్పుడే టెలికమ్యూనికేషన్‌ దినోత్సవానికి అర్థం చేకూరుతుంది.

teli 3