
శ్రీనగర్ : ఆక్రమిత, హింసాత్మక ప్రాంతమైన జమ్ముకాశ్మీర్‌లో జి20 సమావేశాలు నిర్వహించడం అనాలోచిత నిర్ణయమని అమెరికన్ విద్యావేత్త నోమ్ చోమ్స్కీ వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో జి 20 పర్యాటక సమావేశాలను నిర్వహించడం అనాలోచిత నిర్ణయమని మంగళవారం రాత్రి విడుదల చేసిన ఓ వీడియోలో నోమ్ చోమ్స్కీ పేర్కొన్నారు. కాశ్మీర్ అనేక బాధిత ప్రాంతాల్లో ఒకటి. ఇటీవల 2019లో 1947లో జమ్ము కాశ్మీర్ భారత్‌తో చేసుకున్న చట్టపరమైన ఒప్పందాన్ని రద్దు చేసిందని అన్నారు. బహుశా ప్రపంచంలోనే అత్యంత సైనిక నిఘా కలిగిన ప్రాంతం కాశ్మీరే కావచ్చని అన్నారు. ప్రజలను ఖైదు చేయడం, హింసించడంతో పాటు అదృశ్యం కావడం ఇక్కడ సర్వసాధారణం. అలాగే ఇక్కడి పౌరులు తమ ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయారని అన్నారు.
మీడియా స్వేచ్ఛపై తీవ్రమైన అణచివేత కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నట్లు ప్రదర్శిస్తోందని న్యూయార్క్‌కి చెందిన జర్నలిస్టుల రక్షణ కమిటీ (సిపిఐ) పేర్కొంది. మోడీ ప్రభుత్వం జర్నలిస్టులపై కొనసాగిస్తున్న అమానుషమైన దాడికి ముగింపు పలకాలని, అక్రమంగా నిర్బంధించిన నలుగురు కాశ్మీరీ జర్నలిస్టులు అసిఫ్ సుల్తాన్, ఫహద్ షా, సజద్ గౌల్, ఇర్ఫాన్ మెహ్రాజ్‌లను వెంటనే విడుదల చేయాలని సిపిఐ పిలుపునిచ్చింది.
మంగళవారం నోమ్ చోమ్స్కీ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల అనంతరం జి 20 ప్రతినిధులు తమ మూడు రోజుల శ్రీనగర్ పర్యటనలో భాగంగా బుధవారం నగరంలోని కొన్ని ప్రదేశాలను సందర్శించారు. నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్‌మార్గ్, దాచిగామ్‌లను భద్రతా కారణాల దృష్ట్యా సందర్శనా ప్రాంతాల నుండి తొలగించినట్లు అధికారులు తెలిపారు.
జమ్ముకాశ్మీర్‌లో జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం 2019లో రద్దు చేసిన అనంతరం ఇవి మొదటి అంతర్జాతీయ సమావేశాలు కావడం గమనార్హం. అయితే జి20 సభ్య దేశాలైన చైనా, సౌదీ అరేబియా, టర్కీలతో పాటు ఆతిథ్య దేశం ఈజిప్ట్ ఈ సమావేశాలను బాయ్ కాట్ చేశాయి.