Nov 25,2021 06:48
  • వ్యవసాయ మార్కెట్‌ కమిటీ భూముల్లో ఆయిల్‌ వ్యాపారం
  • 107 స్థలాలు ఎంపిక

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : వ్యవసాయ మార్కెట్‌ యార్డు స్థలాలను పెట్రోలు బంక్‌లకు అద్దెకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ట్రాఫిక్‌ రద్దీ, డిమాండ్‌ ఉండే రోడ్ల పక్కనున్న మార్కెట్‌ యార్డుల స్థలాలను పెట్రోలియం సంస్థలకు లీజుకు ఇచ్చే విషయంపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 107 మార్కెట్‌ యార్డు భూములను అద్దెకిచ్చే నిమిత్తం ఎంపిక చేశారు. అధ్యయనం పూర్తయి అంగీకారం కుదిరిన పలు స్థలాలకు లీజును కోట్‌ చేయాలంటూ ఆయిల్‌ కంపెనీలను మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ కోరినట్లు సమాచారం. కొన్ని స్థలాలపై అధ్యయనం సాగుతోంది. ఎపి వ్యాప్తంగా 191 వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలు (ఎఎంసి), వాటి పరిధిలో సబ్‌ యార్డులతో కలుపుకొని మొత్తం 324 యార్డులున్నాయి. వీటిలో వినియోగంలో లేని యార్డులు 170కిపైన ఉన్నాయంటున్నారు.
కమర్షియల్‌ ప్లేస్‌లపై కన్ను
రోడ్ల పక్కనున్న యార్డు స్థలాలల్లో పెట్రోలు బంకులు ఏర్పాటు చేసుకునేందుకు హెచ్‌పిసిఎల్‌, బిపిసిఎల్‌, ఐఒసి సంస్థలు మార్కెటింగ్‌ శాఖకు ప్రతిపాదించాయి. పెట్రోల్‌, డీజిల్‌, నేచురల్‌ గ్యాస్‌ వ్యాపారానికి అనువుగా ఉన్న స్థలాలను గుర్తించాయి. మార్కెటింగ్‌, పెట్రోలియం సంస్థల మధ్య చర్చలు జరిగాయి. బంక్‌లకు అవసరమైన స్థలాలను ఆయిల్‌ కంపెనీలు గుర్తించాలి. అవసరమైన స్థలాలను మార్కెట్‌ కమిటీ అద్దెకు ఇస్తుంది. బంక్‌ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వ్యయాన్ని ఆయిల్‌ కంపెనీలే భరిస్తాయి. నిర్ధారణయిన అద్దెలను మార్కెట్‌ కమిటీలకు చెల్లిస్తాయి. బంక్‌ల నిర్వహణ బాధ్యత మార్కెట్‌ కమిటీలది. ఎఎంసిలే సిబ్బందిని నియమించుకొని బంక్‌లను నిర్వహించాలి. అలా నిర్వహించినందుకు ఎఎంసిలకు ఆయిల్‌ కంపెనీలు డీలర్‌ మార్జిన్‌ కింద కమీషన్‌ చెల్లిస్తాయి. ఎఎంసిలకు ఆయిల్‌ కంపెనీలు చెల్లించే లీజు సంవత్సరాల వంతున ఉంటుందా లేక నెల వారీగా ఉంటుందా, ఎంత ఉంటుంది అనే అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు. డిమాండ్‌, అర్బన్‌, రూరల్‌ వంటి వాటిని బట్టి లీజు ఉంటుంది. లీజును ఆయిల్‌ కంపెనీలు కోట్‌ చేయాలి. అలాగే బంక్‌లు నిర్వహించే ఎఎంసిలకు ఆయిల్‌ కంపెనీలు ఇచ్చే కమీషన్‌ సైతం తేలాల్సి ఉందని అధికారవర్గాలు తెలిపాయి.
చట్టం మాటేంటి?
ఎపి ఎఎంసి చట్టం ప్రకారం నోటిఫై చేసిన పంటలను రైతులు అమ్ముకోడానికి యార్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అమలు ప్రధానంగా ఎఎంసిల ద్వారానే జరుగుతుంది. ఎంఎస్‌పి లేని పంటలకు ప్రభుత్వం ప్రకటించే సలహా, మద్దతు ధరలకు వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలు యార్డుల్లోనే సాగుతున్నాయి. ఎఎంసి యార్డుల్లో పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలకు ప్రభుత్వం ఎఎంసి చట్టాన్ని మార్పు చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు ఉద్దేశించిన ఎఎంసి స్థలాలను ఆదాయం కోసం లీజుకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎఎంసిలు రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో ఉంటున్నాయని, బంక్‌ల ఏర్పాటు వారికి ఆదాయ వనరుగా మారుతుందని, అవినీతి, అక్రమాలకు, నిధులు తప్పుదారి పట్టడానికి ఆస్కారం ఉందనే వాదనలూ ఉన్నాయి.