Mar 19,2023 01:17
జగనన్న కాలనీలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

ప్రజాశక్తి-మేదరమెట్ల: జగనన్న కాలనీలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో గృహాలను యుద్ధప్రాతిపదికన నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. కొరిసపాడు మండలం తిమ్మనపాలెం, మేదరమెట్ల గ్రామాలలో శనివారం జగనన్న కాలనీలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గృహాల నిర్మాణంపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. గ్రామాలలో ఇంత సిబ్బంది ఉన్నప్పటికీ కూడా గృహ నిర్మాణాలలో ఆలస్యం ఎందుకు వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. కొత్తగా గృహాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 90 రోజులలో ఇళ్ల పట్టాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రూపులలో లేని స్త్రీలను కూడా గ్రూపుల లోనికి తీసుకుని వారికి బ్యాంకు రుణాలను ఇప్పించి గృహ నిర్మాణాలకు మీరంతా సహకరించాలని ఆమె గట్టిగా అధికారులతో చెప్పారు. కాలనీలకు నీటి వసతి, విద్యుత్‌ వసతి వంటి వాటిపై సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌, జిల్లా పారుదల శాఖ ఎస్‌ఈ విద్యాసాగర్‌, మెప్మ పిడి టి రవికుమార్‌, ఎంపీడీవో డి సురేష్‌ బాబు, చీరాల ఆర్డీవో సరోజినీ దేవి, డిప్యూటీ తహశీల్దారు రాజశేఖర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ బి ఎలిసెమ్మ, సాదినేని లక్ష్మీకుమారి, సాదినేని మస్తాన్‌రావు, క్రాంతి పథకం సిబ్బంది పాల్గొన్నారు.