
- 40రోజులు సంతాప దినాలు
దుబారు : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహయాన్ శుక్రవారం మృతి చెందారని అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అబూ దాబి ఎమిరేట్‌కు కూడా ఆయన పాలకుడిగా వున్నారు. రాజ్యాంగం ప్రకారం, 30 రోజుల్లోగా ఫెడరల్ కౌన్సిల్ సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఉపాధ్యక్షుడు, ప్రధానిషేక్మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 1948లో జన్మించిన ఖలీఫా 2004లో అధికారంలోకి వచ్చారు. 2014లో ఆయనకు గుండెపోటు వచ్చింది, అప్పటి నుండి ఆయన బహిరంగంగా కనిపించడం చాలా అరుదైంది. ఆయన సవతి సోదరుడు, అబూదాబి యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ యుఎఇకి డీ ఫ్యాకోట రూలర్‌గా వున్నారు. ఖలీఫా విజ్ఞతను, ఆయన ఉదారతను ప్రశంసిస్తూ మహ్మద్‌బిన్ జాయేద్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 40రోజులు సంతాప దినాలను పాటించనున్నారు. మూడు రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అరబ్, ఇస్లామిక్ నేతలతో సహా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుండి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. మంచి దార్శనికత కలిగిన నేతను యుఎఇ పోగొట్టుకుందని పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు.