Jan 14,2022 07:23

     ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో అధికార బిజెపికి స్వపక్షం నుండే షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. 24 గంటల్లో ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంఎల్‌ఎలు పదవులకు రాజీనామా చేసి పార్టీని వీడారు. బిజెపిలో పుట్టిన ముసలం ఇక్కడితో ఆగదని, ఇంకా పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు బయటికొస్తారని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే యు.పి బిజెపికి చావుదెబ్బే. పార్టీకి గుడ్‌బై చెప్పిన ఇద్దరు మంత్రులూ ఒబిసిలలో గట్టి పట్టున్న నాయకులు కావడంతో బిజెపి బెంబేలెత్తుతోంది. గత ఎన్నికల్లో ఒబిసిలను ఆకర్షించేందుకు సదరు నాయకులను వేరే పార్టీల నుండి తెచ్చుకొని అక్కున చేర్చుకొని వాడుకుంది. అనంతరం వారిని పట్టించుకోకపోవడంతో సమయం చూసుకొని చాచి కొట్టడంతో గుక్కతిప్పులేకుండా ఉంది. ఎన్నికల ముంగిట బిజెపి నుండి రాజీనామాలు, వలసలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పని తీరు, అహంకారమే కారణమని పార్టీని వీడిన వారు చెబుతున్నారు. దళితులను, వెనకబడిన వర్గాలను తీవ్రంగా అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులుగా, ఎంఎల్‌ఎలుగా పని చేసిన వారే అణచివేతపై ఇంతగా ఆందోళన చెందుతున్నారంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.
    యు.పి బిజెపి లో పెల్లుబుకుతున్న అసంతృప్తి, అసహనాలకు యోగి పాలనా వైఫల్యాల వలన ప్రజల నుండి వస్తున్న ఛీత్కారాలే కారణమని వేరే చెప్పనవసరం లేదు. అస్తవ్యస్థ పరిపాలనకు యోగి ఎంత కారణమో, అంతే బాధ్యత యోగి భుజం చరిచి నడిపిస్తున్న బిజెపి అధిష్టానానిది. సి.ఎం అభ్యర్ధిని ప్రకటించకుండానే గత ఎన్నికల్లో బిజెపి పాల్గొంది. గెలిచాక అనూహ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ లో కీలకంగా పని చేస్తూ, ఎంపిగా ఉన్న యోగి తెరపైకొచ్చారు. ఐదేళ్ల యోగి పాలన యావత్తూ విద్వేషాలమయం. గో రక్షణ పేర దళితులు, ముస్లింలపై దాడులు, రౌడీ మూకల దౌర్జన్యాలు, కుల దురహంకార హత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్లు. యు.పి లో శాంతి భద్రతలు లేనే లేవు. కరోనా కట్టడిలో, రోగులకు చికిత్స అందించడంలో ఘోర వైఫల్యాలు లోకానికి తెలిసినవే. ప్రక్షాళన చేస్తామన్న గంగానది లోనే కరోనా రోగుల అనాథ శవాలు గుట్టలు పడటం దయనీయం. యోగి పాలనపై స్వపక్షం నుండే ఫిర్యాదులు రావడంతో అధిష్టానం రంగంలోకి దిగి విచారణ జరిపించింది. కర్నాటకలో ఎడ్యూరప్పను మార్చినప్పుడే యు.పి లో యోగిని మారుస్తారని ప్రచారం జరిగింది. ఎవరి ఒత్తిళ్ల వల్లనోకాని యోగిని మార్చేందుకు బిజెపి అధిష్టానం సాహసం చేయలేకపోయింది. అమిత్‌షా కు యోగిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని రాజీనామా చేసిన నేతలే స్వయంగా చెబుతున్నారంటే ఆయనకు అధిష్టానం అండదండలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది.
     ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యు.పి లో అధికారం నిలబెట్టుకోవడం బిజెపి కి అత్యంత ప్రధానమైపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత 2016లో యు.పి బిజెపి వశమైంది. అందుకు కేంద్రంలో ఉన్న అధికారం, అమిత్‌షా మతతత్వ ఎత్తులు, జిత్తులు ఉపకరించాయి. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంలో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలంటే అక్కడ అధికారంలో ఉండాలనే ఏకైక లక్ష్యం బిజెపిది. గత ఎన్నికల్లో 'ఒక ఓటు రెండు ప్రయోజనాలు' అని గెలిచింది. ఆచరణలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం వేసే ధరలు, భారాలకు జనం కుదేలయ్యారు. కేంద్రం తెచ్చిన నల్ల సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అప్రతిహతంగా సాగిన రైతు ఉద్యమ ప్రభావం, లఖింపూర్‌ ఖేరిలో కేంద్ర మంత్రి తనయుడి హత్యాకాండ యు.పి ప్రజలను, ముఖ్యంగా రైతులను ఆలోచింపజేస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రైతుల రుణ మాఫీ కాలేదు. చెరకు రైతుల బకాయిలు సరేసరి. ప్రజల్లో ఈ వ్యతిరేకతను గుర్తించే ఏదో ఒక వంకతో ఎన్నికలను వాయిదా వేయించాలని యత్నించి విఫలమైంది. యు.పి ని దక్కించుకునేందుకు ప్రధాని, అమిత్‌షా తదితరులు ఎన్నికల షెడ్యూల్‌ నాటికే చుట్టి వచ్చారు. 'వారణాసి అభివృద్ధి' అందులో భాగమే. యోగి అయితే తన ప్రచారంలో మతోన్మాద విషం చిమ్ముతున్నారు. అయోధ్య రామాలయాన్ని వాడుకోజూస్తున్నారు. ఎంతగా ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నించినా...రైతు ఉద్యమం ప్రజల్లో రగిల్చిన సమైక్య, లౌకిక చైతన్యం...యు.పి రాష్ట్రాన్నంతటినీ రానున్న ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావితం చేయక మానదు.