Jun 10,2021 21:21

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వ మార్పు జరగనుందా.. అందుకే యోగి ఢిల్లీ పర్యటనకు వెళ్లారా.. అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనలో యోగి ఆధిత్యనాథ్‌ శుక్రవారం ప్రధాని మోడీతో సమావేశం కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సీనియర్‌నేత జితిన్‌ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బిజెపి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీలో చేరిన 24 గంటల్లోనే యుపి ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నివాసానికి చేరుకున్నారు. అప్నా దళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌ కూడా గురువారం సాయంత్రం అమిత్‌ షాతో సమావేశమైనట్లు సమాచారం. కాగా, యోగి బుధవారం రాష్ట్ర బిజెపి చీఫ్‌ స్వతంత్ర దేవ్‌ సింగ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సాల్‌తో సమావేశం నిర్వహించారు. ప్రతి నెలా జరిగే సాధారణ సమావేశం అని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ.. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సునీల్‌ బన్సాల్‌ హెలికాఫ్టర్‌ ద్వారా లక్నో చేరుకోవడం ప్రధాన రాజకీయ వర్గాల్లో అనుమానాలు రేకిత్తిస్తోంది. మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ను నియంత్రించడంలో యోగి ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే నాయకత్వ మార్పు జరగడం మంచిదని బిజెపి అధిష్టానం భావిస్తుందా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.