Sep 15,2021 06:35

    క ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక మొదటి పేజీలో యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలోని ఉత్తరప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వం అచ్చు వేయించిన అడ్వర్టయిజ్‌మెంట్‌ బిజెపి వల్లె వేస్తున్న అభివృద్ధి మంత్రపు డొల్ల తనాన్ని బయటపెట్టింది. యోగి అబద్ధపు ప్రచారంపై ప్రతిపక్షాలు నిలదీసేసరికి నాలుక్కరుచుకొని చేసేది లేక గమ్మునుంది. 'యోగి నాయకత్వంలో మార్పు దిశగా యు.పి' అనే టైటిల్‌తో వేసిన వ్యాపార ప్రకటనలో ముఖ్యమంత్రి నిలువెత్తు చిత్రం పక్కన ఇతర రాష్ట్రం పశ్చిమబెంగాల్‌ కోల్‌కతాలో గల భారీ వంతెన ఫోటోను ముద్రించారు. ఇతర రాష్ట్రాల్లోని మౌలిక సదుపాయాల చాయా చిత్రాలను దొంగిలించి వాటిని తమ రాష్ట్రంలో నిర్మాణం చేసినట్లు యోగి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ యావత్‌ విపక్షాలూ బోనులో నిలబెట్టేసరికి బిజెపి అవాక్కయింది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట రచ్చ కావడంతో నష్ట నివారణకు దిగింది. వివాదాస్పద అడ్వర్టయిజ్‌మెంట్‌పై సదరు పత్రిక ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదు. వ్యాపార ప్రకటనలలోని ఇతివృత్తంతో పత్రికకు ఎలాంటి బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెప్పడానికి వెనుక యోగి, బిజెపి ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఉదంతంతో యోగి ప్రభుత్వం, ఆ మాటకొస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అసత్యాలు వండి వార్చడం తప్ప చేసిన అభివృద్ధి, సంక్షేమం ఏమీ లేదని తేలిపోయింది.
      చెప్పుకోడానికి చేసిందేమీ లేనప్పుడు మతోన్మాద ఎజెండాను బయటికి తీసి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను సమీకరించి రాజకీయంగా లబ్ధి పొందడమనే విద్య బిజెపి కే స్వంతం. ఇప్పుడు యు.పి లో యోగి చేస్తున్నదదే. గత ఎన్నికల్లో సంఫ్‌ుపరివారం ముఠాలు, అమిత్‌షా అక్కడే తిష్ట వేసి చేయాల్సిందంతా చేశారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో యోగి తన విద్వేష ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా ఎక్కుపెట్టారు. పేదల రేషన్‌ కార్డులను మతంతో ముడిపెట్టారు. తమ ప్రభుత్వం రాక మునుపు 'అబ్బా జాన్‌' అని చెప్పుకునే వాళ్లకే రేషన్‌ అందేదంటూ ముస్లింలకే రేషన్‌ కార్డులిచ్చారని విష బీజాలు వెదజల్లుతున్నారు. వాస్తవానికి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద యు.పి లో గత సర్కారు దిగిపోయే సమయానికి 4.01 కోట్ల లబ్ధిదారులుండగా యోగి వచ్చాక కేవలం 85 లక్షలే పెరిగి 4.86 కోట్లకు చేరారు. ముస్లింలకే గత ప్రభుత్వం రేషన్‌ కార్డులిచ్చారనడం ఎంత అబద్ధమో ఈ లెక్కలే సాక్ష్యాలు. కాంగ్రెస్‌ ఉగ్రవాదానికి తల్లి వంటిదని, సమాజ్‌వాదీ పార్టీ తేలు బాపతు అని, బిఎస్‌పి అవినీతి పార్టీ అని తూలనాడుతున్నారు. రామ భక్తులపై కాల్పులు జరిపే తాలిబన్‌ల రాజ వంశాల అనుకూల మనస్తత్వం ఆ మూడు పార్టీలదని, రామునిపై విశ్వాసాన్ని అవమానిస్తారని, తాము మాత్రం అయోధ్యలో గొప్ప రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేశామని ఉన్మాద వాక్చాపల్య విన్యాసాలకు దిగుతున్నారు ముఖ్యమంత్రి స్థానంలోని వ్యక్తి.
     గత ఎన్నికల్లో బిజెపి ఎత్తుకున్న నినాదం 'డబుల్‌ ఇంజన్స్‌, డబుల్‌ బెనిఫిట్స్‌'. యోగి పాలనలో మచ్చుకైనా అది కనిపించదు. రైతుల అవస్థలు చెప్పనలవి కాదు. ఎన్నికల హామీ రుణమాఫీ సగం రైతులకు కూడా కాలేదు. చెరకు రైతులకు క్వింటాలుకు రూ.450 ఇస్తామనగా, కనీస మద్దతు ధర రూ.383 కూడా రాక నష్టపోతున్నారు. చెరకు రైతులకు రూ.9 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. ధాన్యాల కొనుగోళ్లు 20 శాతం కూడా జరగలేదు. రైతులకు అన్యాయం చేస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి ని గద్దె దించేందుకు ముజఫర్‌నగర్‌ రైతు ర్యాలీ తీర్మానించింది. కరోనా కట్టడిలో యోగి ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో లోకానికి తెలిసిందే. బతికుండగానే రోగులకు ఆక్సిజన్‌ తొలగించిన దృశ్యాలు, గంగానదిలో మృతదేహాలు అమానవీయతకు అద్దం పట్టాయి. దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు, గోరక్షక గూండాల దౌర్జన్యాలు, మాఫియా పేరుతో అమాయక ముస్లింలపై నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు, ఉద్యోగులపై ఎస్మా ప్రయోగాలు యు.పి లో శాంతి భద్రతల పతనానికి, రాజ్యహింసకు కొన్ని ఉదాహరణలు. యోగి నేతృత్వంలో అన్నింటా భ్రష్టు పట్టిన యు.పి లో మరోసారి అధికారం దక్కించుకునే ఎత్తుగడతో నడుపుతున్న ఉన్మాద రాజకీయాలు. అయితే ఒక వైపు పశ్చిమ యు.పి ప్రాంతంలో సాగుతున్న రైతు ఉద్యమం కులాతీత, మతాతీత సెక్యులర్‌ స్ఫూర్తితో బలపడుతూ యోగి విచ్ఛిన్న, విద్వేష రాజకీయాలకు సవాలు విసురుతోంది. ఇంకో పక్క ప్రజా సమస్యల పరిష్కారంలో, ముఖ్యంగా వైద్య, ఆరోగ్య రంగంలోని ఘోర వైఫల్యాలను ప్రజలు ఇప్పట్లో మరిచి పోతారా అన్నది కీలక ప్రశ్న.