Oct 17,2020 15:55

షిల్లాంగ్‌ : పశ్చిమ ఖాసీ హిల్స్‌ జిల్లాలోని ట్యాంకుల నుండి యురేనియం  లీకైనట్లు వచ్చిన నివేదికలపై నిపుణుల కమిటీతో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు మేఘాలయ ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిపుణుల కమిటీని నియమించినట్లు ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్‌ టెన్సోంగ్‌ అన్నారు. యురేనియం వ్యర్థాల ట్యాంకులకు సమీపంలోని ప్రాంతాల్లో అధిక రేడియోధార్మికత కలిగిన ఉద్గారాలు వెలువడుతున్నాయని పలు స్వచ్చంధ సంస్థలతో పాటు పౌరసంస్థలు, గ్రామస్థులు, స్థానికులు ఫిర్యాదు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్‌ రావ్‌ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, యురేనియం నిక్షేపాలను వెలికితీసే సమయంలో వెలువడే వ్యర్థాలను నిల్వ చేసేందుకు డోమియాసియాట్‌-నోంగ్బా-జిన్రిన్‌ ప్రాంతంలో నాలుగు ట్యాంకులు ఉన్నాయని , రెండు రిజర్యాయర్లు ఉన్నాయని, ఇవి దశాబ్ద కాలం కిందట నిర్మించడంతో పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా, దేశంలోనే అత్యుత్తమ యురేనియం నిల్వలు కలిగిన ప్రాంతం కావడం గమనార్హం. అత్యధికంగా రాష్ట్రంలోని డోమియాసిట్‌, లోస్టాయిన్‌, వాహ్కిన్‌ ప్రాంతాల్లో అంచనా ప్రకారం.. 9.22 మిలియన్‌ టన్నులు ఉన్నాయి.