Apr 07,2021 17:12

బ్రస్సెల్స్‌ : యూరోప్‌ దేశాల్లో మనిషి సగటు జీవితకాలం తగ్గింది. ముఖ్యంగా 27 దేశాలు ఉన్న యూరోపియన్‌ యూనియన్‌ కరోనా వైరస్‌ తీవ్రంగా దెబ్బతిసింది. దీంతో గతేడాది కొన్ని దేశాల్లో సగటు ఆయుష్షు పడిపోయింది. ఈ మేరకు ఈయూ స్టాటిస్‌టికల్‌ ఏజెన్సీ యూరోస్టాట్‌ బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో గతేడాది కోవిడ్‌ మహమ్మారి వల్ల.. చాలావరకు యూరోప్‌ దేశాల్లో సగటు జీవితాలం తగ్గినట్లు పేర్కొన్నది. అత్యధిక స్థాయిలో స్పెయిన్‌లో 2019తో పోలిస్తే.. సగటు జీవితకాలం 1.6 ఏళ్లు తగ్గినట్లు వెల్లడించింది. బల్గేరియాలో ఆ నష్టం 1.5 ఏళ్లుగా ఉన్నది. ఆ తర్వాత స్థానంలో లుథివేనియా, పోలాండ్‌, రొమేనియా దేశాలు ఉన్నాయి. ఈ మూడు దేశాల్లోనూ 1.4 ఏళ్ల సగటు ఆయుష్షు తగ్గింది. కానీ డెన్మార్క్‌, ఫిన్‌ల్యాండ్‌ దేశాల్లో మాత్రం సగటు జీవిత కాలం పెరిగింది. ఆ దేశాల్లో 0.1 ఏళ్ల ఆయష్షు కలిసి వచ్చింది. బెల్జియంలో జీవితకాలం 82.1 నుంచి 80.9, బల్గేరియాలో 75.1 నుంచి 73.6కు, స్పెయిన్‌లో 84 నుంచి 82.4కు, ఇటలీలో 83.6 నుంచి 82.4 ఏళ్లకు పడిపోయింది.