Feb 06,2023 23:02

ప్రజాశక్తి-సింగ్‌నగర్‌: విజయవాడ యూత్‌ ఫెస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్న యువజన సంబరాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా క్రికెట్‌, షటిల్‌, కబడ్డీ, వాలీబాల్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో వెస్టర్న్‌, ఫోక్‌ డాన్స్‌ పోటీలు, బృందగానం, కోలాటం వంటి పోటీలను నిర్వహించచనున్నారు. సింగ్‌నగర్‌ ఎం.బి స్టేడియంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సిహెచ్‌.విష్ణువర్ధన్‌, పారిశ్రామికవేత్త రమిశెట్టి కొండలరావు, ప్రముఖ న్యాయవాది సప్పా రమేష్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఇటువంటి క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విజయవాడ యూత్‌ ఫెస్ట్‌ నిర్వాహకులు పి.కృష్ణ, జి.విజయప్రకాష్‌, నాగేశ్వరరావు మాట్లాడుతూ 24 టీమ్‌లు క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయని తెలిపారు. ప్రధమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ. 15 వేలు, తతీయ బహుమతి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజాముద్దీన్‌, నోహిత్‌ కృష్ణ, పీరు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం షటిల్‌ పోటీలు నిర్వహించారు.