
- ఎక్కడికక్కడే అడ్డగింతలు
- పలు జిల్లాల్లో అరెస్టులు, ముందస్తు నోటీసులు
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్‌వాడీలు సోమవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి నిర్బంధాన్ని ప్రయోగించారు. పలు జిల్లాల్లో అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను అడ్డుకొని అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరికి 149 సిఆర్‌పిసి కింద నోటీసులు ఇచ్చారు. విజయనగరంలో జిల్లాలో 91 మంది అంగన్‌వాడీలను, పలువురు సిఐటియు నాయకులను అరెస్టు చేసి బబ్బిలి, బాడంగి, విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో పలువురు సిఐటియు, అంగన్‌వాడీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. చిప్పగిరి మండలంలో అంగన్‌వాడీ వర్కర్లను గృహ నిర్బంధంలో ఉంచారు. జిల్లా కేంద్రమైన నంద్యాలలో సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులో బస్సులో విజయవాడ బయలుదేరిన అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారికి భోజనం కూడా పెట్టలేదు. అనంతపురం జిల్లా గుంతకల్లులో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు రేష్మాను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో అంగన్‌వాడీ ప్రాజెక్టు అధ్యక్షులు యం.శోభారాణి, కార్యకర్త నీరజ, ఆయాలు జి.భాగ్యలక్ష్మి, జి.కోటేశ్వరిని చంటి పిల్లలతో సహా స్టేషన్‌కు పిలిపించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. చలో విజయవాడకు వెళ్తే చర్యలు తీసుకుంటామంటూ ఆ జిల్లాలోని అంగన్‌వాడీలకు సెక్షన్ 149 సిఆర్‌పిసి కింద నోటీసులు అందించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, పల్నాడు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు అంగన్‌వాడీలు, సిఐటియు, ఐద్వా నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు అందజేశారు. ఈ జిల్లాల్లో పలువురిని గృహ నిర్బంధంలో ఉంచారు.