Jun 23,2022 22:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి బరిలోకి దించిన ద్రౌపది ముర్ముకు వైసిపి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఆ ప్రకటనలో పేర్కొంది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గిరిజన మహిళయైన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఆమెకు మద్దతు తెలపడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని తెలిపింది. ముందుగా నిర్ణయించుకున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా ముర్ము నామినేషన్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకావడం లేదని, ఆయనకు బదులుగా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి హాజరు అవుతారని తెలిపింది.