
లక్నో : ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం అత్యవసరంగా ల్యాండయింది. వారణాసి నుండి లక్నోకు బయలు దేరిన హెలికాఫ్టర్.. మార్గమధ్యంలో ఓ పక్షిని ఢీకొట్టడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వారణాసిలోని రిజర్వు పోలీసు లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అయిన కాసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. అక్కడి నుంచి వెంటనే ఆదిత్యనాథ్ స్థానిక సర్క్యూట్ హౌస్కు చేరుకున్నారు. అనంతరం ఆయన విమానం ద్వారా లక్నో బయలుదేరనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ యంత్రాంగం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. శనివారం వారణాసి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్ అక్కడి పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతితో పాటు శాంతి భద్రతల అంశాలను సమీక్షించారు. ఆదివారం ఉదయం లక్నో వెళుతుండగా ఈ పరిణామం తలెత్తింది.