కారకాస్ : వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వెనిజులాలో గురువారం ఉదయం వరుసగా రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. వరుస భూకంపాల ధాటికి రాజధాని కారకాస్‌లో పలు భవనాలు కూలిపోయాయి. సుమారు 32మంది మరణించగా, 700మంది గాయపడినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కారకాస్‌లోని సైమన్ బొలీవర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ప్రకటించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం.
వెనిజులాలో భారీ భూకంపాలు భారీ సంఖ్యలో ప్రాణనష్టాన్ని కలిగించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఆదేశానికి సాయం అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, చిలీ సహా పలు దక్షిణ అమెరికా దేశాలు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. వరల్డ్ సెంట్రల్ కిచెన్ వ్యవస్థాపకుడు జోస్ ఆండ్రూస్ 1మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. వెనిజులాలో సహాయక చర్యల కోసం ఈ విరాళాన్ని ప్రకటిస్తున్నట్లు ఆయన ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.
వెనిజులా భూకంప బాధితులకు మెక్సికో సంఘీభావం
సహాయక చర్యలపై నిశిత పర్యవేక్షణ
మెక్సికో సిటీ:వెనిజులా ప్రజలకు మెక్సికో సంఘీభావం ప్రకటించింది.కారకాస్‌తో పాటు మధ్య,ఉత్తర,వాయువ్య వెనిజులా ప్రాంతాలను కుదిపేసిన 7.2, 7.5తీవ్రతల వరుస భూకంపాల వల్ల సంభవించిన ప్రాణ,ఆస్తి నష్టంపై మెక్సికో ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మెక్సికో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఇప్పటివరకు మెక్సికన్లు ఈ విపత్తు వల్ల ప్రభావితమైనట్లు సమాచారం అందలేదని విదేశాంగ మంత్రి రాబర్టో వెలాస్కో పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు వైద్య బృందాలు,అగ్నిమాపక సిబ్బంది,భద్రతా దళాలు,స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు అత్యవసర శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు ఆహారం,వైద్య సహాయం,తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వెనిజులాలోని మెక్సికో రాయబార కార్యాలయం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. సహాయం కోసం మెక్సికన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా మెక్సికో విదేశాంగ శాఖ పేర్కొంది.








కామెంట్‌లు (0)