ఒక మనిషి చనిపోతే ఆ ఇంట్లో విషాదం అలముకుంటుంది. నిలువెల్లా దుఃఖం కమ్మేస్తుంది. అలాంటి సమయంలో ఆ కుటుంబానికి కావాల్సింది ఓదార్పు. భరోసా. అండగా నిలిచే మనుషులు. కానీ కొన్ని సందర్భాల్లో సానుభూతి చూపాల్సిన చోట మరింత బాధను మోపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రాచలంలో మొన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యుల మృతదేహాలను వారు నివసించిన అద్దె ఇంటికి తీసుకురాకుండా ఇంటి యజమాని అడ్డుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి సందర్భం ఇదే మొదటిది కాదు. అద్దె ఇంటి వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇంటి వద్దకు తీసుకురావొద్దని యజమానులు కరాఖండిగా చెబుతున్న ఉదంతాలు చాలా సార్లు ఎదురవుతున్నాయి. కొంతమంది అరిష్టం పేరుతో సాగిస్తున్న నిరాకరణ చాలా దారుణం. అమానవీయం!
మనిషి జీవితం జననం, పెరుగుదల, వృద్ధాప్యం, మరణం అనే సహజ దశల సమాహారం. జననాన్ని ఆనందంతో స్వాగతించే సమాజం మరణాన్ని కూడా జీవిత సత్యంగా అంగీకరించాలి. నిన్నటి వరకు మనతో కలిసి జీవించిన ఒక మనిషి మరణించిన క్షణం నుంచి అశుభానికి ప్రతీకగా ఎలా మారిపోతాడు? అతడు నివసించిన ఇంటికి అతని మృతదేహం ఎందుకు రాకూడదు? అతని కుటుంబం ఎందుకు ఈ నిరాకరణను ఎదుర్కోవాలి? ఈ ప్రశ్నలకు హేతుబద్ధమైన సమాధానాలు వెతికితే ఎక్కువ సందర్భాల్లో మూఢనమ్మకాలు, అపోహలే కనిపిస్తాయి. మరణం వల్ల కాదు, మరణం గురించి మనకు ఉన్న భయాల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తమ ఇంటి ఆవరణలో విషాద వాతావరణం నెలకొనడం కొందరికి ఇష్టం ఉండటం లేదు. ఆ విషాదాన్ని అద్దె ఇంటి వారు మాత్రం కోరి తెచ్చుకుంటారా అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక వ్యక్తి బతికున్నంతకాలం ఆ ఇంట్లోనే నివసిస్తాడు. అదే ఇంట్లో తిరుగుతాడు. నెలనెలా అద్దె చెల్లిస్తూ యజమానికి ఆదాయం అందిస్తాడు. కానీ అతడు ప్రాణాలు కోల్పోయిన క్షణంలోనే ఆ ఇంటికి అతని మృతదేహం రాకూడదని చెప్పడం ఏ తర్కానికీ అందదు. మరణాన్ని జీవిత సత్యంగా కాకుండా అశుభ సూచనగా చూడటం అమానవీయం.
గౌరవప్రదమైన చివరి చూపు
ఒక్కసారి బాధిత కుటుంబం స్థానంలో మనల్ని మనం ఉంచుకుని ఆలోచిస్తే ఆ బాధ మరింత స్పష్టమవుతుంది. కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోవడం జీవితంలోనే అత్యంత బాధాకరమైన అనుభవం. ఆ సమయంలో మనసు శూన్యంగా మారిపోతుంది. ఇంట్లోని ప్రతి వస్తువూ ఒక జ్ఞాపకంగా కనిపిస్తుంది. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులకు కావాల్సింది సానుభూతి, ఓదార్పు, “మేమున్నాం” అని చెప్పే మనుషులు. కానీ ఆ సమయంలోనే తలుపులు మూసేయడం, మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకపోవడం, వారిని ఒంటరిగా వదిలేయడం వారి బాధను రెట్టింపు చేస్తుంది. అప్పటికే ఒక ప్రాణాన్ని కోల్పోయిన కుటుంబానికి మరో సామాజిక శిక్ష విధించడం మానవీయ సమాజ లక్షణం కాదు.
మరణించిన వ్యక్తికి చివరి వీడ్కోలు పలకడం అనేది మానవీయ సంప్రదాయం. కొంతసేపు మృతదేహాన్ని ఇంట్లో ఉంచి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు చివరి చూపు చూడడం సాధారణ ప్రక్రియ. అనంతరం ఎవరికి వారు తమ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. మృతదేహాన్ని కొద్ది గంటల పాటు ఇంటి ఆవరణలో ఉంచడంలో అశుభం ఎక్కడుంది? వాస్తవానికి ఏ మతమూ బాధలో ఉన్న కుటుంబాన్ని అవమానించమని చెప్పదు. కరుణ, సహానుభూతి, పరస్పర సహకారం అనే విలువలనే అన్ని మతాలు ప్రోత్సహిస్తాయి.
మానవత్వమే ప్రమాణం
భారత రాజ్యాంగం మానవ గౌరవాన్ని అత్యున్నత విలువగా గుర్తిస్తుంది. మరణించిన వ్యక్తికి కూడా గౌరవం ఉండాలని న్యాయవ్యవస్థ అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. గౌరవప్రదమైన అంత్యక్రియలు, కుటుంబ సభ్యుల భావోద్వేగాలకు విలువ ఇవ్వడం, మానవీయ ప్రవర్తన చూపించడం వంటి అంశాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటాయి. సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవ గౌరవం వంటి విలువలు పాఠ్యపుస్తకాలలో చదవడానికి మాత్రమే కాదు; ఇలాంటి సందర్భాల్లో ఆచరణలో కనిపించాలి. సమాజం అభివృద్ధి చెందిందా లేదా అన్నది ఆకాశాన్ని తాకే భవనాలతో కొలవలేం. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో కొలవలేం. దుఃఖంలో ఉన్న మనిషి పక్కన నిలబడగల సామర్థ్యంతోనే కొలవాలి. ఒక కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడ్డామా? కన్నీరు కారుస్తున్న మనిషిని ఓదార్చగలిగామా? మరణించిన వ్యక్తికి గౌరవప్రదంగా వీడ్కోలు చెప్పగలిగామా? అనేవే నాగరికతకు అసలైన ప్రమాణాలు. దుఃఖభరిత సమయాల్లో ఆ బాధను మరింతగా పెంచకుండా ఉండడమే మానవత్వం అనిపించుకుంటుంది. దుఃఖానికి కులం లేదు. మతం లేదు. ధనిక-పేద తేడా లేదు. అది ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవం. అందుకే దుఃఖంలో ఉన్న కుటుంబాలకు అవసరమయ్యేది మూసిన తలుపులు కాదు; తెరిచిన మనసులు. అవసరమయ్యేది అనుమానాలు కాదు; ఆప్యాయత. నిరాకరణ కాదు; భరోసా. అప్పుడు మాత్రమే మనం నిజంగా నాగరిక సమాజంగా, మానవీయ సమాజంగా ఎదిగామని చెప్పుకోగలం.








కామెంట్‌లు (0)