ముంబయి : దాదాపు రెండు వారాల ఆలస్యం తర్వాత ముంబయిని పలకరించిన రుతుపవనాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రహదారులు జలమయమయ్యాయి. చెట్లు కూలిపోవడంతో అనేక చోట్ల నష్టం వాటిల్లింది. ఈ పరిణామాలతో జనజీవనం అస్థవ్యస్థమైంది. అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మంగళవారం రాత్రి 8:30 గంటల నుండి బుధవారం ఉదయం 5:30 గంటల మధ్య రామ్ మందిర్, కొలాబా, శాంతాక్రూజ్ అనే మూడు కేంద్రాలలో భారీ వర్షాలు నమోదయ్యాయి. మండే ఎండలతో అల్లాడుతున్న ముంబైకి ఈ వర్షాలు ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ భారీ వర్షాలు విస్తృతమైన నష్టాన్ని కూడా కలిగించాయి. వర్షాల కారణంగా విక్రోలి వెస్ట్‌లోని ఒక భవనం సమీపంలో గోడ కూలిపోయింది. మరో ఘటనలో, ఒక చెట్టు కారుపై పడటంతో వాహనం దెబ్బతిని, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా సెంట్రల్ రైల్వే ట్రాన్స్-హార్బర్ లైన్ సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుర్బే మరియు కోపర్ఖైరానే మధ్య రైలు పట్టాలు వరద నీటితో దెబ్బతినడంతో థానే మరియు వాషి మధ్య రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. దీనివల్ల ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినప్పటికీ, ప్రస్తుతం నీరు తగ్గుముఖం పట్టిందని, ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం ముంబైలో కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరించారు.








కామెంట్‌లు (0)