Apr 01,2021 22:16

అమరావతి బ్యూరో : శాసనమండలికి కొత్తగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు గురువారం ఛైర్మన్‌ షరీఫ్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, గోదావరి జిల్లాల టీచర్స్‌ నియోజకవర్గం నుండి పిడిఎఫ్‌ అభ్యర్థి షేక్‌ సాబ్జి విజయం సాధించారు. ఎమ్మెల్యేల కోటాలో వైసిపి నుంచి విజయవాడకు చెందిన కరీమున్నీసా, టెక్కలి ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాసరావు, తిరుపతి ఎంపిగా ఎన్నికై చనిపోయిన బల్లి దుర్గాప్రసాదు కుమారుడు కల్యాణ చక్రవర్తి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ ఎన్నికయ్యారు. వారితో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం షరీఫ్‌ వారికి నియమావళి అందజేసి అభినందించారు. చట్టసభల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించి, తగు గౌరవం లభించేలా వ్యవహరించాలని సూచించారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు అంజాద్‌ బాషా, ధర్మాన కృష్ణదాస్‌, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, పాల్గన్నారు.

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి : సాబ్జి
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మండలిలో తనవంతు పాత్ర పోషిస్తానని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి తెలిపారు. ఉపాధ్యాయలకు సిఎం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సిపిఎస్‌ రద్దు, పిఆర్‌సి కోసం కృషి చేస్తానని తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చరర్లుగా ప్రమోషన్‌ కల్పించడం, కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కోసం తనవంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. మున్సిపల్‌ టీచర్ల ప్రమోషన్లు, అప్‌గ్రేడేషన్‌, ఎయిడెడ్‌ కళాశాలల సమస్యల పరిష్కారం కోసం మండలిలో పోరాడతానని పేర్కొన్నారు. మన్యం ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీల అంశంపైనా మండలిలో ప్రశ్నించి వారి సమస్యలు పరిష్కరించే దిశగా తనవంతు పాత్ర పోషిస్తానని సాబ్జి తెలిపారు.

ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

 

ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

 

ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

 

ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

 

ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం