Aug 17,2022 22:40

ఎసిబికి చిక్కిన విఆర్‌ఒ సోమేశ్వరరావు

ప్రజాశక్తి - కొత్తూరు: పొన్నుటూరు గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ) టి.సోమేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుధవారం చిక్కాడు. మ్యుటేషన్‌ చేసేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్‌పి బి.వి.ఎస్‌.ఎస్‌ రమణమూర్తి, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నుటూరుకు చెందిన బెవర శ్రీదేవి భర్త కృష్ణారావు 2018లో మృతిచెందారు. పిఎం కిసాన్‌, రైతుభరోసా రాకపోవడం, బ్యాంకు రుణాలకూ నోచుకోకపోవడంతో, భర్త పేరున ఉన్న మూడెకరాల భూములను తన పేరున మార్చుకునేందుకు శ్రీదేవి సిద్ధమైంది. భూములకు సంబంధించిన పాస్‌బుక్‌ తన పేరిట మార్చేందుకు మ్యుటేషన్‌ కోసం నాలుగు నెలల కిందట విఆర్‌ఒను కలిసింది. మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసినా విఆర్‌ఒ పట్టించుకోకపోవడం దాని కాలవ్యవధి ముగిసింది. మ్యుటేషన్‌ కోసం నాలుగు నెలలుగా పలుమార్లు విఆర్‌ఒ చుట్టూ తిరుగుతున్నా రేపుమాపు అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు మ్యుటేషన్‌ చేయాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని విఆర్‌ఒ డిమాండ్‌ చేశాడు. తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని అనడంతో రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ముందు డబ్బులు ఇస్తేనే పనిచేస్తానని విఆర్‌ఒ కరాఖండిగా చెప్పాడు. ఆయన తీరుతో విసిగి వేశారిన ఆమె ఈనెల మూడో తేదీన ఎసిబి అధికారులను ఆశ్రయించింది. వారి సూచనల మేరకు ఆమె బుధవారం రూ.15 వేలు తీసుకుని పొన్నుటూరు గ్రామ సచివాలయానికి వెళ్లింది. విఆర్‌ఒను కలిసి ఆ మొత్తం అందజేశాక ఎసిబి డిఎస్‌పి రమణమూర్తి నేతృత్వాన సిఐలు కె.భాస్కరరావు, హరి, సిబ్బంది దాడి చేశారు. విఆర్‌ఒ నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసి విశాఖపట్నంలోని ఎసిబి కోర్టుకు తరలించారు. విఆర్‌ఒ స్టేట్‌మెంట్‌ ప్రకారం తహశీల్దార్‌ పి.బాలను, డిప్యూటీ తహశీల్దార్‌ కె.బాలకృష్ణ, కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఎసిబి అధికారులు విచారణ చేశారు. వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.