
యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ ఇంటివాడయ్యాడు. కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీతో అతడు ఏడుగులు నడిచాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. స్నేహితుడి పెళ్లి సంబరాల్లో నేచురల్ స్టార్ నాని, యువ కథానాయకుడు సందీప్ కిషన్ సందడి చేశారు. కాగా ఆది, నిక్కీ ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. 2015లో వచ్చిన 'యాగవరైనమ్ నా కక్కా' అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఆ సమయంలో స్నేహితులుగా మారిన వీరు 'మరగాధ నాణ్యం' చిత్రంతో ప్రేమికులయ్యారు. వివాహంతో ఇప్పుడు ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.