- నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులపైకి కారు
- సిఐ, ఎస్ఐకు గాయాలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ : నామినేషన్ కేంద్రం వద్దకు తన కారును అనుమతించలేదన్న కోపంతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి చల్లా వెంకటేశ్వరరావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా తన వాహనంతో బారికేడ్లను ఢీకొట్టి ఇద్దరు పోలీసు అధికారులకు గాయపర్చారు. పోలీసుల కథనం ప్రకారం... 36వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి చల్లా వెంకటేశ్వరరావు శ్రీకాకుళం నగరంలోని వంశధార కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి ఎఎస్ఎన్ కాలనీ మీదుగా వస్తుండగా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఆయన కారును పోలీసులు ఆపారు. వాహనం దిగి వెళ్లి నామినేషన్ వేయాలని సూచించారు. దీంతో, ఆగ్రహానికి గురైన ఆయన, తాను వికలాంగుడినని చెప్తూ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్తుండగానే వెంకటేశ్వరరావు ఒక్కసారిగా బారికేడ్లపైకి కారును ఎక్కించారు. దీంతో, వాటి అవతల నిలబడి ఉన్న సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ మెట్ట సుధాకర్‌పై బారికేడ్లు పడి వారి కాళ్లకు గాయాలయ్యాయి. బారికేడ్ల కింద పోలీసులు నలిగిపోతున్నా కారును తీయకుండా ఆయన లోపలే తాపీగా కూర్చొని వాగ్వాదానికి దిగారు. తోటి పోలీసులు అప్రమత్తమై వాహనాన్ని వెనక్కి తీయించే క్రమంలో వెనుక ఉన్న మరో కారును కూడా ఆయన ఢీకొట్టారు. గాయపడిన సిఐ, ఎస్ఐను ప్రభుత్వ సర్వజనాస్పత్రికి పోలీసులు తరలించారు. చికిత్స అనంతరం సాయంత్రం వారు డిశ్ఛార్జి అయ్యారు. బాధిత అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు డిఎస్పి సిహెచ్ ధనుంజయనాయుడు తెలిపారు.
అభ్యర్థి ఒక్కరే.. నామినేషన్లు నాలుగు
శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిజెపి నాయకుడు చల్లా వెంకటేశ్వరరావు కుమార్తె చల్లా గ్రీష్మ మేయర్ పదవికి ఏకంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం నగర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 14న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజునే చల్లా గ్రీష్మ నాలుగు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇందులో భాగంగా జనసేన అభ్యర్థిగా ఒకటి, టిడిపి అభ్యర్థిగా మరొకటి, బిజెపి అభ్యర్థిగా ఇంకొకటి, స్వతంత్ర అభ్యర్థిగా వేరొక నామినేషన్‌ను దాఖలు చేశారు. టిడిపి కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ సీటు కేటాయించినా, వెంటనే ఆ పార్టీ తరుఫున బరిలో నిలిచేందుకు వీలుగా ఆమె ఈ వ్యూహాన్ని అనుసరించారు.
కూటమి అభ్యర్థిగా రాధారాణి ఖరారు
మరోవైపు, పొత్తులో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ సీటును జనసేన పార్టీకి కేటాయించారు. ఆ పార్టీ తరఫున కూటమి మేయర్ అభ్యర్థిగా దానేటి రాధారాణిని ఖరారు చేస్తూ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాలుగు నామినేషన్లు వేసిన చల్లా గ్రీష్మ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.









కామెంట్లు (0)