సమీక్షలో సిపిడిసిఎల్ సిఎమ్‌డి పుల్లారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ర్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిసిపిడిసిఎల్) సిఎమ్‌డి పి పుల్లారెడ్డి సూచించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో విజయవాడలోని సిపిడిసిఎల్ కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పుల్లారెడ్డి సూచించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో వాటిని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, మరమ్మతు పరికరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అన్ని సర్కిల్, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని, తుపాను ప్రభావం దృష్ట్యా సిబ్బంది సెలవు తీసుకోవడానికి వీల్లేదని వెల్లడించారు.








కామెంట్‌లు (0)