బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AP: ప్రాదేశిక ఎన్నికల్లోనూ దాడులు, దౌర్జన్యాలు

1 గంట క్రితం

ప్రాదేశిక ఎన్నికల్లోనూ 
          దాడులు, దౌర్జన్యాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 12:15 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

- టిడిపి శ్రేణుల దాష్టీకం

- నామినేషన్లు వేయనీయకుండా అడ్డగింత, పత్రాలు చించివేత

- పోలీసుల ప్రేక్షక పాత్ర

- పులివెందులలో రెండు లారీలు, బైక్‌‌లకు నిప్పు

ప్రజాశక్తి - యంత్రాంగం : కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టిడిపి శ్రేణుల దాష్టీకంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నా, విమర్శలు వెల్లువెత్తుతున్నా జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి స్థానాల నామినేషన్ల ఘట్టం ప్రారంభం రోజు కూడా కొన్ని జిల్లాల్లో దాడులు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లు వేయనీయకుండా అడ్డగించడం, నామినేషన్‌ ‌పత్రాలను లాక్కొని చించివేయడం వంటి ఘటనలు చోటుచేసు కున్నాయి. పోలీసుల అండతోనే టిడిపి వారు రెచ్చిపోతున్నాయని ‌విపక్షాలు విమర్శిం చాయి. కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టు ఆక్షేపించినా ఇటువంటివి పు నరావృతం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

కర్నూలు మండలంలో సిపిఎం ఎంపిటిసి అభ్యర్థిపై టిడిపి దాడి

​ నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన నో డ్యూ ధ్రువీకరణ పత్రం కోసం కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయానికి సిపిఎం కర్నూలు మండలం ఉల్చాల ఎంపిటిసి అభ్యర్థి మధుసూదన్‌పైనా, సిపిఎం నాయకులు శివపైనా, కార్యకర్తలపైనా టిడిపి గూండాలు దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. చివరికి సిఐ జోక్యం చేసుకొని మధుసూదన్‌ కు ఎన్‌ఒసి ఇప్పించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

మార్కాపురంలో సిపిఎం అభ్యర్థి నామినేషన్‌ ‌పత్రాలు లాక్కోవడానికి టిడిపి శ్రేణుల ప్రయత్నం

మార్కాపురం జిల్లా సిఎస్‌పురం-2 ఎంపిటి స్థానానికి నామినేషన్ వేసేందుకు అభ్యర్థి ఊసా వెంకటేశ్వర్లు, ఆ పార్టీ నాయకులు నాయకులు ఊసా రాజ్యలక్ష్మి, బత్తుల జ్ఞానరాజు, గుర్రం లక్ష్మయ్య, బక్కా జేసురత్నంతో కలిసి ఎంపిడిఒ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న టిడిపి నాయకులు వారిని అడ్డుకొని నామినేషన్ పత్రాలను లాక్కొనేందుకు ప్రయత్నిం చారు. వెంకటేశ్వర్లు అప్రమత్తంగా ఉండి వాటిని వారికి అందకుండా కాపాడుకున్నారు. పరిస్థితిని గమనించి నామినేషన్‌ ‌వేయకుండా అభ్యర్థి వెనుదిరిగారు. నామినేషన్‌ ‌కేంద్రం వద్ద జరిగిన ఘటనపై ఎస్‌ఐకి మౌఖికంగా ఫిర్యాదు చేశారు.

ఎంపి అవినాష్‌‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

పులివెందుల మండల జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులు నామినేషన్లు వేయించేందుకు కడప ఎంపి వైఎస్‌.అవినాష్‌‌రెడ్డితో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్తుండగా వారిని పోలీసులు గంటల తరబడి అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దుండగులు వైసిపి అభ్యర్థులు, వైసిపి శ్రేణులపై రాళ్ల దాడి చేశారు. అనంతరం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం పోలీసులు ఎంపిని మినహా అభ్యర్థులను నామినేషన్‌ ‌వేసేందుకు లోనికి అనుమతించారు. ఇదే సమయంలో కూటమి సభ్యులు నామినేషన్‌ ‌వేసేందుకు రావడంతో పోలీసులు వారిని వెనక్కు పంపే ప్రయత్నం చేశారు. వైసిపి అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్తుండగా వారిపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. పోలీసులు అడ్డుకొని పంపివేయడంతో కడపకు అవినాష్‌‌రెడ్డి వెళ్లిపోయారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల, బి.మఠం, కలసపాడు, బి.కోడూరు, వేంపల్లి, మైలవరం సహా పలు మండలాల్లో దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చింపేయడం, వేంపల్లి మండలంలో వైసిపి కార్యకర్తల కోసం సిద్ధం చేసిన భోజనాలను నేలపాలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

పుంగనూరులో వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య దాడులు

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎంపిటిసి నామినేషన్ల సందర్భంలో వైసిపి, టిడిపి శ్రేణులు రాళ్లు, బీరు, సోడా బాటిళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు.‌ టిడిపికి చెందిన ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పది ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరుగూప్రుల వారినీ పోలీసులు చెదరగొట్టారు. నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్తున్న చిత్తూరు మాజీ ఎంపి రెడ్డప్పను పుంగనూరులో టిడిపి శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లి వైసిపి జడ్‌‌పిటిసి అభ్యర్థి కిరణ్మయి నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని దుండగులు లాక్కుని చింపివేశారు.

మాజీ డిప్యూటీ సిఎం నారాయణస్వామి కారుపై దాడి

వైసిపి పెనుమూరు జెడ్‌‌పిటిసి అభ్యర్థితో నామినేషన్ వేయించడానికి చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయానికి వచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని కొందరు అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడి జరిగి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. టిడిపి వారే ఈ చర్యకు పాల్పడ్డారని వైసిపి నాయకులు ఆరోపించారు. వెదురుకుప్పంలో తమ పార్టీ ఎంపిటిసి అభ్యర్థి రామయ్య నామినేషన్ పత్రాలను పోలీసులే చించివేశారని వైసిపి నాయకులు ఆరోపించారు. వి.కోట మండలానికి చెందిన వైసిపి అభ్యర్థి ప్రకాష్‌పై దాడి జరగడంతో ఆయన గాయపడ్డారు.

రైల్వేకోడూరులో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు రాస్తారోకో

తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో కూటమి నాయకులు, వైసిపి శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వైసిపి అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతించలేదంటూ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. తొట్టంబేడు మండలంలో వైసిపి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా టిడిపి వారు దాడులకు పాల్పడ్డారని ఎంపి మద్దిల గురుమూర్తి ఆరోపించారు.

బనగానలపల్లెలో ఎంపిటిసి అభ్యర్థులను నిర్బంధించిన పోలీసులు

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని 24 మంది ఎంపిటిసి అభ్యర్థులను బుధవారం తెల్లవారుజామున పోలీస్‌ స్టేషన్లకు తీసుకొచ్చి నిర్బంధించారు. దీంతో, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైసిపి నియోజకవర్గ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి, వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి తదితరులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అభ్యర్థులను విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మధ్యాహ్నం రెండు గంటలను అభ్యర్థులందరినీ విడుదల చేశారు. దీంతో తొలిరోజు బనగాపనపల్లె మండలంలో వైసిపి ఎంపిటిసి అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు.

మంత్రాలయంలో వైసిపి జిల్లా కార్యదర్శిపై దాడి

కర్నూలు జిల్లా మంత్రాలయంలో టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. వగరూరు గ్రామం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థులతో కలిసి వచ్చిన వైసిపి జిల్లా కార్యదర్శి మండల ఇన్‌‌ఛార్జి సి.విశ్వనాథ్ రెడ్డి, టిడిపి అభ్యుర్థులతో నామినేషన్‌ ‌దాఖలు చేయించేందుకు వచ్చిన ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఎన్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు, మాధవరం గ్రామ మాజీ సర్పంచ్ ఎన్ రఘునాథ్ రెడ్డి ఒకరుకొకరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇక్కడ మీకేం పని అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోవడం, దూషణలకు దిగడంతో ఘర్షణ చోరటు చేసుకుంది. విశ్వనాథ్ రెడ్డిపై టిడిపి శ్రేణులు పిడి గుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడం వంటి చర్యలకు పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడులతో భయపెట్టలేరని అంతా వీడియోలో రికార్డు అయిందని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని విశ్వనాథ్ రెడ్డి తెలిపారు.

పిడుగురాళ్ల వైసిపి జెడ్‌‌పిటిసి అభ్యర్థి భర్తకు తీవ్ర గాయాలు

​ పిడుగురాళ్ల వైసిపి జెడ్‌‌పిటిసి అభ్యర్థి మూడేళ్ల భారతి, ఆమె భర్త పెద్ద లక్ష్మారెడ్డిపై ప్రత్యర్ధులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పెద్ద లక్ష్మారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆర్‌‌డిఒ కార్యాలయ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. రొంపిచర్లలో ఎంపిటిసి నామినేషన్‌ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా 300 మందికి పైగా కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రాగా పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో వైసిపి వారిపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చర్యతో ఆగ్రహం వ్యక్తం చేసిన గోపిరెడ్డి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. నామినేషన్‌ ‌వేయడానికి వెళ్లినవైసిపి వేల్పూరు ఎంపిటిసి అభ్యర్థి శిఖ తుమోతి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించివేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు వైసిపి మాజీ ఎమ్మెల్యేలను, ఆ పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. మార్కాపురం జిల్లా ​సిఎస్‌ఫురం మండలం పెదరాజుపాలెం వైసిపి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన జొన్నకోతుల దివ్యభారతి నామినేషన్ కేంద్రానికి వెళ్లనీయకుండా టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి.

​పులివెందులలో వైసిపి మున్సిపల్‌ అభ్యర్థుల వాహనాలు దగ్ధం

వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన నిరంజన్ రెడ్డి, అంజనప్ప ఇళ్లపై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నిరంజన్‌రెడ్డి ఇంటిపై బీరు బాటిళ్లతో దాడి చేసిన ఇంటి ముందు ఉన్న రెండు లారీ తగలబెట్టారు. అంజనప్ప ఇంటి వద్దగల మోటార్ బైక్ ను, మరో అభ్యర్థి శ్రీరాములు ఇంటి వద్దగల బైకును కాల్చివేశారు. వరస సంఘటనలతో పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

వైసిపి అభ్యర్థులను టార్గెట్ చేశారు : ఎంపి అవినాష్‌‌రెడ్డి

వైసిపి అభ్యర్థులను టార్గెట్ చేశారని, మా ఆస్తులు ధ్వంసం చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఎంపి వైఎస్.అవినాష్ రెడ్డి ఆరోపించారు. దాడికి గురైన వైసిపి అభ్యర్థుల ఇంటికి వెళ్లి బుధవారం ఆయన పరిశీలించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్