ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రొయ్యలు, రొయ్యల ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు విధానం వల్ల కలిగే ఆర్థిక ప్రభావాలను అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రొయ్యల ఎగుమతులపై గతంలో 0.25 శాతం, దేశీయ మార్కెట్లో విక్రయాలపై 0.50 శాతం మార్కెట్ ఫీజు అమల్లో ఉండేది. అయితే 2022 ఏప్రిల్ 22న జారీ చేసిన జీవో ద్వారా ఎగుమతులపై 0.25 శాతం నుంచి ఒక శాతానికి, దేశీయ మార్కెట్ విక్రయాలపై 0.50 శాతం నుంచి ఒక శాతానికి ఫీజును ప్రభుత్వం పెంచింది. మరోవైపు రొయ్యల ఎగుమతులపై మార్కెట్ ఫీజును పూర్తిగా మినహాయించాలని మత్స్యశాఖ కమిషనర్, భారత సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం ప్రభుత్వాన్ని కోరాయి. అయితే, మార్కెట్ కమిటీల నిర్వహణ, అభివృద్ధి పనులు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు మార్కెట్ ఫీజు వసూళ్లే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుడు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో పూర్తి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని అభిప్రాయపడుతూ.. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో ప్రస్తుత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, మార్కెట్ ఫీజు విధింపు వల్ల కలిగే ఆర్థిక ప్రభావాలను అంచనా వేసి నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆర్థిక శాఖ కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్ సభ్యులుగా, మార్కెటింగ్ శాఖ సంచాలకుడు సభ్య కన్వీనర్‌గా ఉంటారు.
మార్కెట్ ఫీజు, ఆర్థిక ప్రభావాలపై కమిటీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026, 08:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)