శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రావిటీ కెనాల్ నిర్మాణంలో జాప్యం

2 గంటల క్రితం

gravitu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 07:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నిలిచిపోతున్న కొండవీటి వాగు వరద నీరు

- బ్లూప్లానుకు ఆమోదం వచ్చినా నిర్మాణంలో ఆలస్యం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి పరిధిలో వరద ముంపు నివారణ కోసం నిర్మించాలనుకున్న గ్రావిటీ కెనాల్స్‌ ‌నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ప్రతి ఏడాది కొండవీటి వాగు నుండి వరద నీరు వస్తున్నా బయటకు పంపేందుకు వీలుగా పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టలేదు. అమరావతి పరిధిలోని కొండవీటి వాగు ప్రవాహ ప్రాంతంలో ఇటీవల వచ్చిన అర్నబ్‌‌, మురసు తుపాన్లకు నీరుకొండ పరిసరాల్లో నీరొచ్చి చేరింది. కాలువ నిర్మాణంలో ప్రభుత్వం జాప్యం చేసిందనే విమర్శలూ వ్యక్తమయ్యాయి. కొండవీటి వాగుకు ఛానలైజ్‌ ‌లేకపోవడంతో వర్షపునీరు గతంలో పొలాల్లో నుండి ప్రవహించి ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. రాజధాని నిర్మాణ సమయంలో టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్ ఆధ్వర్యాన పర్యావరణ ప్రభావం అంచనా నివేదికలను తయారు చేయించారు. నివేదికలో చాప్టర్ 4.5.1లో 63 నుండి 69 వరకూ ఉన్న పేజీల్లో కొండవీటి వాగు ముంపు పరిధిలో 13,500 ఎకరాలు ఉందని, ఇందులో రాజధాని పరిధిలోకి వచ్చే భూమి 10,600 ఎకరాలు ఉందని పేర్కొన్నారు. మిగిలిన భూమి గతంలో పెదపరిమి రెవెన్యూలో ఉండేది. ఇప్పుడు అది కూడా పూలింగు పరిధిలోకి రావడంతో ముంపు విస్తీర్ణం కొంత పెరిగింది. ముంపు వచ్చిన ప్రతిసారీ కనీసం ఐదు నుండి ఏడు రోజులు ఉంటుందని తెలిపారు. దీంతో రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భూ మట్టాన్ని +25 మీటర్లు (+25m ఎఎంఎస్‌ఎల్‌)గా లేదా ఆయా ప్రాంతాల్లో నమోదైన అత్యధిక వరద మట్టం కంటే ఎక్కువ ఎత్తులో ఉండేలా నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతోపాటు ప్రత్యేక రిజర్వాయర్లు నిర్మించడం ద్వారా నీటి నిర్వహణ చేపట్టేందుకు బ్లూప్లాన్‌ ‌కూడా ఇచ్చారు. ఇందులో కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ నిర్మాణం కీలకంగా ఉంది. అయితే ఇప్పటికీ కెనాల్ను పూర్తిస్థాయిలో నిర్మించలేదు. గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు మొత్తం ఏడేళ్లలో కెనాల్ నిర్మాణం పూర్తికాలేదు. అక్కడక్కడ నిర్మించినా కీలకమైన నీరు కొండ ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నుండి దిగువకు కాలువ నిర్మాణం జరగకపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్లు నిలిచిపోతోంది. ప్రభుత్వం తాత్కాలిక మళ్లింపు చర్యలు తీసుకుంటోంది మినహా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నిర్మాణ ప్రాంతంలో నిలిచిన వరద నీరు కూడా బయటకు వెళ్లే మార్గం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్లూప్లాన్‌‌లో పేర్కొన్న విధంగా కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ నిర్మించాలని భూములిచ్చిన రైతులు కోరుతున్నారు. ‌ప్రతియేడాది ముంపు వస్తున్నా కాలువ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్