రేషన్ షాపుల ద్వారా పంపిణీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాబోయే పండగల నేపథ్యంలో ప్రజలకు నిత్యా వసర సరుకులను తక్కువ ధరకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్ రూ.125, కిలో చక్కీ అట్టా రూ.25కు విక్రయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మూడు నెలలపాటు ఈ మార్కెట్ జోక్య కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలశాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ, వైస్ ఛైర్మన్ అండ్ ఎమ్‌డి కె కన్నబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో రేషన్ కార్డుకు నెలకు ఒక కిలో కందిపప్పు, ఒక లీటరు పామాయిల్ అందించనున్నారు. చక్కీ అట్టాను ఒక్కో కార్డుకు కిలో చొప్పున తొలుత వచ్చిన వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం నెలకు 14,888 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 14,888 కిలోలీటర్ల పామాయిల్, 3,384 మెట్రిక్ టన్నుల చక్కీ అట్టా అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించారు. ఈ పథకం అమలుకు నెలకు రూ.100.20 కోట్ల సబ్సిడీ అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ వ్యయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సొంత నిధుల నుంచి భరించాలని స్పష్టం చేసింది.








కామెంట్లు (0)