శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గురుకులంలో జ్వరాల కలకలం

1 రోజు క్రితం

గురుకులంలో జ్వరాల కలకలం
- 71 మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్లు
 - ప్రజాశక్తి వెబ్ కథనంతో స్పందించిన అధికారులు 
- విద్యార్థులకు వైద్య పరీక్షలు 
- పరామర్శించిన పుష్పశ్రీవాణి, వీరేశ్ చంద్ర దేవ్, ఎమ్మెల్యే జగదీశ్వరి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 08:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 71 మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్లు

- ప్రజాశక్తి వెబ్ కథనంతో స్పందించిన అధికారులు

- విద్యార్థులకు వైద్య పరీక్షలు

- పరామర్శించిన పుష్పశ్రీవాణి, వీరేశ్ చంద్ర దేవ్, ఎమ్మెల్యే జగదీశ్వరి

ప్రజాశక్తి - కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యంజిల్లా కురుపాం మండలంలోని శివన్నపేట ఎపి గిరిజన గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 71 మంది విద్యార్థులు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. వారిలో ముగ్గురు విద్యార్థులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రజాశక్తి వెబ్ న్యూస్‌‌లో వచ్చిన కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించి పాఠశాలలోని విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేశారు. ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ నాగేశ్వరరావు గురుకులంలో వాటర్ ప్లాంట్‌‌ను పరిశీలించి పరీక్షల కోసం నీటి శ్యాంపిల్‌‌ను తీసుకెళ్లారు. గతంలో ఇదే పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు ఇద్దరు మృతి చెందారు. వందలాది మంది విద్యార్థులు వివిధ సందర్భాల్లో అనారోగ్యానికి గురై ఆస్పత్రిపాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా 71 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది. పాఠశాలలో అపరిశుభ్ర వాతావరణమే జ్వరాలకు కారణమని తెలుస్తోంది. ఇటీవల తుపాను నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిన నేపథ్యంలో జ్వరాల బారిన పడ్డారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రజాశక్తి ద్వారా విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైరిచర్ల వీరేశ్ చంద్ర దేవ్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాఠశాలను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

గురుకులాల్లో ఆరోగ్య పరీక్షలకు ఆదేశాలు : కలెక్టర్

కురుపాం మండలం శివన్నపేటలోని ఎపిటిడబ్ల్యుఆర్ఎస్, యుఆర్‌‌జెసి పాఠశాలలో విద్యార్థులకు జ్వరాల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ప్రత్యేక వైద్య చర్యలు చేపట్టిందని కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు. పాఠశాలలో మొత్తం 559 మంది విద్యార్థులకు ర్యాపిడ్ డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆ విద్యార్థిని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని పేర్కొన్నారు. మరో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం కురుపాం సిహెచ్‌సికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉన్నారని వివరించారు.

ప్రజాశక్తి`పై ఆర్‌‌డబ్ల్యుఎస్‌ అధికారి ఆగ్రహం

పై ఘటనపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ ప్రజాశక్తి వెబ్‌లో వార్త రాసిన విలేకరి జి ఢిల్లీశ్వరరావుపై ఆర్‌‌డబ్ల్యుఎస్‌ డిఇ కె నాగేశ్వరరావు దురుసుగా మాట్లాడారు. డిఇ వ్యాఖ్యలపై కురుపాం ప్రెస్ క్లబ్ తరఫున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్లు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని, వాస్తవాలను రాసిన విలేకరిపై దురుసుగా మాట్లాడడం సమంజసం కాదని డిఇని నిలదీశారు. విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ మన్యం జిల్లా కార్యదర్శి బి అనిల్‌, సహాయ కార్యదర్శి గంగారావు డిమాండ్‌ చేశారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్