సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు ..!

50 నిమిషాల క్రితం

Heat returns to the Telugu states!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 03:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : గత వారం రోజులుగా కురిసిన విస్తారమైన వర్షాలతో ఉపశమనం పొందిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మళ్లీ ఎండల తీవ్రత తప్పేలా లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఎపి, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు కొంత ఊరటనిచ్చాయి. అయితే తాజాగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు తగ్గి, పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


ప్రారంభమైన రుతుపవనాల తిరోగమనం ...

తెలుగు రాష్ట్రాల నుంచి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభమైనట్లు వాతావరణశాఖ అధికారి వెల్లడించారు. దీంతో ఇకపై రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌కు, అంతకంటే ఎక్కువకు చేరే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో వాతావరణం కొంత చల్లగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరగవచ్చని చెబుతున్నారు.


కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు .....

రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైనప్పటికీ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న కర్నాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు పడే అవకాశముంది. గాలుల దిశలో వస్తున్న మార్పుల కారణంగా ఆగ్నేయ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లోనూ అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగనుంది.


ఈశాన్య రుతుపవనాలపై ఆశలు ....

ప్రస్తుతం ఎపి, తెలంగాణలో వాతావరణం క్రమంగా పొడిగా మారుతోంది. తగినంత తేమతో కూడిన ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాల వైపు ప్రవేశించే వరకు భారీ వర్షాలకు అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్‌లో ఏర్పడే కొత్త రుతుపవనాల కదలికలను బట్టి వర్షాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు పెరుగుతున్న ఎండలు, ఉక్కపోతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్