శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమి పాలనలో శాంతిభద్రతలు విఫలం

11 గంటల క్రితం

ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 07:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వైసిపి అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌

- విద్యార్థుల జీవితాలతో చెలగాటం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమై, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని వైసిపి అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ‌తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ బాగుందని ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. విద్యుత్ డిమాండ్, ప్రభుత్వ ఆదాయం, నిరుద్యోగ రేటు అంశాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక తిరోగమనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలైన కాగ్, ఎపిఈఆర్‌‌సి గణాంకాలే రాష్ట్ర దుస్థితిని బయటపెడుతున్నాయని తెలిపారు. 2023-24లో డిస్కమ్‌ల ద్వారా విద్యుత్ విక్రయాలు 71,722 మిలియన్ యూనిట్లు ఉంటే, 2025-26లో 70,885 మిలియన్ యూనిట్లకు పడిపోయాయని పేర్కొన్నారు. విద్యుత్ డిస్పాచ్ 2023-24లో 79,758 మిలియన్ యూనిట్లు ఉండగా, 2025-26 నాటికి 78,546 మిలియన్ యూనిట్లకు తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో ఏకంగా 1,212 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ తగ్గిపోయిందని చెప్పారు. నిజంగా కొత్త పరిశ్రమలు వచ్చి ఉంటే విద్యుత్ వినియోగం తగ్గేదా అని ప్రశ్నించారు. పరిశ్రమల స్థాపన కేవలం ప్రచారమేనని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే ఇళ్లలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని, కానీ ఇప్పుడు డిమాండ్ పడిపోయిందని తెలిపారు. కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 2023-24లో రూ. 85,922.36 కోట్లుగా ఉందని, 2025-26 నాటికి రూ. 86,552 కోట్లకు మాత్రమే చేరిందని వార్షిక వృద్ధి రేటు 0.15 శాతం మాత్రమే ఉందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బాగుంటే సొంత ఆదాయ వృద్ధి 10 నుంచి 12 శాతం ఉండాలని, నేడు 0.15 శాతానికి దిగజారిందని పేర్కొన్నారు. మొదటి రోజు నుంచే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సిఎం సహా కూటమి నేతలు అబద్ధాలు చెబుతున్నారని, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరుద్యోగ రేటులో దేశంలోనే ఎపి నాలుగో స్థానంలో ఉందని అన్నారు. రెండో త్రైమాసికానికి నిరుద్యోగ రేటు మరింత పెరిగి, రాష్ట్రం 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకిందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఏ గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఎవరికి ఉద్యోగాలు వచ్చాయో, పిఎఫ్, ఈఎస్ఐ లెక్కలు చూపించాలన్నారు. కనీసం 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన జాబితా అయినా ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. కూటమి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగాలు తీసేశారని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించారని తెలిపారు.

సిఐఐ సదస్సుల పేరుతో పరస్పర డబ్బా కొట్టుకోవడం తప్ప వచ్చిన పెట్టుబడులు శూన్యమని అన్నారు. ఎన్నికల హామీల ఎగవేత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే గ్రోత్ ఇంజన్, క్వాంటం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని పేర్కొన్నారు.

విద్యార్థుల జీవితాల‌తో కూట‌మి ప్ర‌భుత్వం చెల‌గాటం

చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, ఫీజుల ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని వైఎస్సార్‌సిపి స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్