- హోంమంత్రి వంగలపూడి అనిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాప్ కార్యాలయం వద్ద వైసిపి నిర్వహించిన ధర్నాల్లో పాల్గొన్న వారిలో అత్యధికులు నేరచరితులేనని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించడం కూటమి నైజం అయితే మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నైజం రౌడీయిజం అని వైసిపి పాలన ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వరకు కొనసాగి వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని చెప్పారు. చట్టబద్ధ పాలనతో రాష్ట్రంలో క్రైమ్ రేటును 14 శాతం తగ్గించామని, శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్లే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని అన్నారు. శాప్ కార్యాలయం వద్ద నిరసనల పేరుతో వీరంగం సృష్టించిన వారిలో 60 నుంచి 70 శాతం మంది నేరచరిత్ర కలిగిన వారు నేరచరితులతో సంబంధం ఉన్నవారేనని చెప్పారు. వైసిపి పాలనలో జరిగిన ఎపిపిఎస్సి గ్రూప్-1, లిక్కర్ కుంభకోణంపై జగన్ ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డిఎస్సిపై తప్పుడు కూతలు కూస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టి అవమానించిన చరిత్ర జగన్‌దని, కూటమి ప్రభుత్వం బడిని గుడిగా, గురువులను దైవంగా భావిస్తూ గౌరవిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై దాడికి తెగబడిన రౌడీషీటర్లు, సంఘ విద్రోహ శక్తుల వికృత చేష్టలన్నీ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.








కామెంట్‌లు (0)