- కేంద్ర బృందానికి వెల్లడించిన ఎపిఎస్‌డిఎంఎ ఎమ్‌డి ప్రఖర్ జైన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మురసు తుపాను కారణంగా రూ.రూ.2,484.43 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కేంద్ర బృందానికి వివరించారు. తుపాను నష్టం అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించింది. ఈ సందర్భంగా ప్రఖర్ జైన్ కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తుపాను తీవ్రత, రాష్ట్రంలో జరిగిన నష్టం, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు సన్నద్ధత, సహాయక, పునరుద్ధరణ చర్యలను వివరించారు. ఈ తుపాను కారణంగా ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆయన తెలిపారు. మొత్తం 106 మండలాలు, 315 గ్రామాలు, 746 గ్రామ, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 1,93,769 మంది ప్రజలు ప్రభావితమయ్యారని వివరించారు. ప్రభుత్వం 536 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 31,080 మందికి సురక్షిత ఆశ్రయం కల్పించిందన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 3,066 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించడంతో పాటు 253 వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు.12,967 ఫిషింగ్ బోట్లు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని, 8 జిల్లాల్లో 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని వివరించారు. అదేవిధంగా సుమారు 1.86 లక్షల మంది రైతులకు చెందిన 1.43 లక్షల హెక్టార్లలో సాధారణ పంటలు, 6,756 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, 3,859 ఇళ్లు, 1,385 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ నెల 12వ తేదీ నాటికి శాఖల వారీగా ప్రాథమిక నష్టం అంచనా వివరాలను వెల్లడిస్తూ.. ఆర్ అండ్ బీ శాఖకు రూ.889 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.875 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.337 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.136 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు రూ.119 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.54 కోట్లు నష్టం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ.. మురసు తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టిన సహాయక, పునరుద్ధరణ చర్యలను అభినందించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర అధికారులతో భేటీ అనంతరం కేంద్ర బృందం సభ్యులు రెండు టీమ్‌లుగా విడివడి శుక్రవారం బాపట్ల, ఏలూరు జిల్లాల పర్యటనకు బయలుదేరింది. శనివారం పల్నాడు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.








కామెంట్లు (0)