సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిపిపి పద్ధతిలో విద్యుత్‌ సరఫరా

12 నిమిషాల క్రితం

amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అమరావతిలో స్మార్ట్ పవర్ గ్రిడ్

- విధివిధానాల రూపకల్పనపై కసరత్తు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అమరావతి రాజధాని నగరంలో విద్యుత్‌ను పబ్లిక్‌ ‌ప్రైవేటు పార్టనర్‌‌షిప్‌ ‌పద్ధతిలో నేరుగా వినియోగదారులకు విక్రయించనున్నారు. దీనికోసం స్మార్ట్‌ ‌పవర్‌ ‌గ్రిడ్‌ ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబరు నెలలో దీనికి టెండర్లు పిలిచినా ఎవరూ రాకపోవడంతో పొడిగించి నవంబరు 12 వరకూ గడువు పొడిగించారు. భవిష్యత్‌‌లో అమరావతి విద్యుత్‌ సరఫరా కోసం ప్రైవేటు గ్రిడ్‌ ‌చేసేందుకు వీలుగా విధివిధానాల రూపకల్పన కోసం ఆసక్తీ వ్యక్తీకరణ టెండర్లూ పిలిచారు. ప్రస్తుతం దేశంలో నోయిడాలో ఈ తరహా విద్యుత్‌ ‌సరఫరా వ్యవస్థ ఉంది. అమరావతిలో ఏర్పాటైతే ఎపిలోని డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ(డిస్కమ్‌)‌ల్లో తొలి ప్రైవేటు డిస్కమ్‌ అవుతుంది. ప్రపంచబ్యాంకు సంస్కరణల్లో భాగంగా విద్యుత్‌ ‌సరఫరా వ్యసవ్థను ప్రైవేటీకరించాలనే ఆలోచనలో భాగంగా గతంలోనే విద్యుత్‌ ‌రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ ‌గ్రిడ్‌ ఏర్పాటు ఆలోచన కూడా అందులో భాగంగానే చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రపంచబ్యాంకు 15 వేల కోట్లు అప్పు ఇచ్చింది. మరో రూ.15 వేల కోట్ల అప్పుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అధునాతన స్మార్ట్ గ్రిడ్ అండర్‌గ్రౌండ్ (భూగర్భ) విద్యుత్ కేబుల్ వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దనున్నామని టెండర్లో పేర్కొన్న అధికారులు దానికి అనుగుణంగా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పిపిపి) లేదా లైసెన్స్డ్ విధానంలో నేరుగా వినియోగదారులకు 24 గంటలూ విద్యుత్‌ ‌సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీని కోసం ప్రధాన రోడ్ల వెంట ఏర్పాటు చేసిన అండర్‌ ‌గ్రౌండ్‌ డక్టుల ద్వారా విద్యుత్‌‌ లైన్లు వేయడంతోపాటు స్మార్ట్‌ ‌మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్‌ ‌సరఫరా వినియోగంపై నిరంతరం డిజిటల్‌ ‌పర్యవేక్షణ చేయనున్నారు. అధునాతన సబ్‌ ‌స్టేషన్లూ ఏర్పాటు చేయడంతోపాటు గ్రీన్‌ ‌విద్యుత్‌‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 2047 నాటికి నివాస, వాణిజ్య, ఐటి, ఆస్పత్రులు, విద్యా సంస్థలు భారీ ఎత్తున వస్తాయని వాటికి అనుగుణంగా సుస్థిరమైన, అంతరాయం లేని స్మార్ట్‌ విద్యుత్‌ సేవలను అందించడం కోసం ఈ గ్రిడ్‌ ఏర్పాటు అవసరం ఉందని టెండర్లో పేర్కొన్నారు. 2047 నాటికి 1.40 కోట్ల మంది జనాభా ఇక్కడ నివశిస్తారని, దేశంలో ఆధునిక నగరాల్లో ఒకటిగా అమరావతి తయారవుతుందని అంతరాయం లేని విద్యుత్‌ ‌సరఫరా కోసం ఇక్కడ ప్రత్యేక గ్రిడ్‌ ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ఇటీవల డెన్మార్క్‌ ‌ప్రతినిధులతోనూ చర్చించారు. స్మార్ట్‌ ‌విద్యుత్‌ ‌సరఫరా వ్యవస్థపై సలహాలు సూచనలు తీసుకున్నారు. అయితే అమరావతిలో ప్రైవేటు గ్రిడ్‌ ఏర్పాటుపై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంజనీర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు గ్రిడ్‌ ఏర్పాటైతే ఉద్యోగాలు తగ్గుతాయని, వినియోగదారులపై భారం పడుతుందని చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్