రాష్ట్రంలో ఏర్పాటుకు కసరత్తు
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అణు విద్యుత్ కేంద్రాల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా సందేహాలు కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో చిన్న అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) టెక్నాలజీతో ఏర్పాటు చేసే ఈ తరహా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకు జెన్‌కోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అజెండాలో 22వ అంశంగా దీనిని ప్రతిపాదిం చారు. రాష్ట్రంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల యూనిట్లు మూసివేత దశలో ఉండటంతో వాటి స్థానంలో, వాటికి ప్రత్యామ్నాయంగా, ఇతర అనువైన ప్రాంతాల్లో ఎస్‌ఎంఆర్ టెక్నాలజీతో అణు విద్యుత కేంద్రాల ఏర్పాటుకు అనుమతి కోరుతూ జెన్‌కో చేసిన ప్రతిపాదనతో పాటు, ఈ ప్రాజెక్టుల్లో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించే అంశాన్ని చేర్చి మంత్రిమండలి సమా వేశం ముందు ఆమోదానికి ఉంచారు. ‘ఎస్‌ఎంఆర్ సాంకేతిక పరిజ్ఞానం స్థిరపడిన తరవాత ...’ అన్న వాక్యాన్ని ఈ ప్రతిపాదనలో చేర్చినప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన అణు విద్యుత్ కేంద్రాలు ప్రైవేటు రంగంలో ఏర్పాటుకు రాష్ట్రంలో అడుగులు పడినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏమిటీ ఎస్‌ఎంఆర్ టెక్నాలజీ ...?
స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) అంటే చిన్న పరిమాణంలో రూపొందించే అణు విద్యుత్ రియాక్టర్ సాంకేతిక పరిజ్ఞానం. భారీ అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించే రియాక్టర్లతో పోలిస్తే ఇవి చిన్నవిగా ఉంటాయి. వీటిని విడిభాగాల రూపంలో తయారు చేసి, అవసరమైన ప్రాంతానికి తరలించి అక్కడ అమర్చే విధంగా రూపొందిస్తారు. సాధారణ అణు విద్యుత్ కేంద్రంలో మాదిరిగానే, ఎస్‌ఎంఆర్‌లో కూడా అణు విచ్ఛిత్తి ద్వారానే ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తారని నిపుణులు చెబుతున్నారు. దానిలో నీటిని ఆవిరిగా మార్చి ఆ ఆవిరితో టర్బైన్‌ను తిప్పి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. దీని ప్రత్యేకత విద్యుత్ ఉత్పత్తి విధానంలో కాకుండా, రియాక్టర్ పరిమాణం, నిర్మాణ పద్ధతి, మాడ్యులర్ రూపకల్పనలో ఉంటుంది. సాంప్రదాయ అణు విద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్ 1,000 మెగా వాట్ల వరకు ఉండగా, ఎస్‌ఎంఆర్‌లో గరిష్టంగా 300 మెగావాట్ల వరకు ఉత్పత్తి సామర్ధ్యం ఉంటుందని సమాచారం.
ప్రమాదాల సంగతి ఏమిటి?
సాంప్రదాయ అణువిద్యుత్ కేంద్రాలలో జరిగే అన్ని రకాల ప్రమాదాలకు ఎస్‌ఎంఆర్‌లలో కూడా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారీ స్థాయిలో కాకపోయినా రియాక్టర్ ప్రమాదాలు, రేడియేషన్ లీకేజి, అణు వ్యర్థాల నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అన్ని ముప్పులకు ఎస్‌ఎంఆర్‌లతో అవకాశం ఉంది. రియాక్టర్‌ను చల్లబర్చడానికి భారీ ప్రమాణంలో నీరు అవసరమని అంటున్నారు. ఆ స్థాయి నీటి లభ్యతను కూడా పరిశీలించాల్సిఉంది.
ప్రైవేటుకు అవకాశం ఎలా...?
అనేక దేశాలు ప్రైవేటు రంగంలో అణు కార్యక్రమాలను నిషేదిస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వ రంగంలో కూడా పరిమితంగానే చేపడుతున్నాయి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్‌ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా యాక్ట్ (ఎస్‌హెచ్‌ఎఎన్‌టిఐ యాక్ట్) తో మన దేశంలో ప్రైవేటు సంస్థలు అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించడం, సొంతం చేసు కోవడం, నిర్వహించడం వంటి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ చట్టం కింద నిబంధనల రూపకల్పన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఈ ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.







కామెంట్‌లు (0)